తెలంగాణ (Telangana) ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న బలగం సినిమా (Balagam Movie) అంతర్జాతీయంగా సత్తా చాటుతోంది. అనేక అవార్డులు కొల్లగొడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పల్లెపల్లెకు చేరుతోంది. మన నమ్మకాలు, అలవాట్లు, కట్టుబాట్లపై తీసిన చిత్రం కావడంతో పల్లెసీమలు (Villages) ఆహ్వానిస్తున్నాయి. ఈ సినిమా కథ ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘కాకి పిండం ముట్టడమే’ అని చెప్పవచ్చు. మరి అలాంటి సినిమాలోని సన్నివేశం అచ్చం బండి సంజయ్ (Bandi Sanjay Kumar) ఇంట్లో కనిపించింది. ఆ సినిమాలో జరిగినట్టే తన ఇంట్లో జరిగిందని సంజయ్ చెప్పాడు. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అత్త (భార్య అపర్ణ తల్లి) ఇటీవల మృతి చెందింది. 9వ రోజు కార్యక్రమం నిర్వహించేందుకు సంజయ్ కరీంనగర్ (KarimNagar) చేరుకున్నాడు. అయితే పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా కేసు నమోదవడంతో సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో తన అత్తమ్మకు పిండం పెట్టగా కాకి ముట్టలేదట. ఇదే విషయం జైల్లో ఉన్న సంజయ్ కు కుటుంబసభ్యులు చెప్పారు.
‘నరేంద్ర మోదీ చెప్పారు. దేశం మొదట తర్వాత.. పార్టీ ఆ తర్వాతే కుటుంబసభ్యులు అని చెప్పారు. అందుకే మా అత్తమ్మ పక్షి ముట్టుడు కార్యక్రమానికి కరీంనగర్ కు వచ్చా. మా అమ్మ తర్వాత నన్ను కన్న కొడుకులా ఆమె చూసుకున్నది. ఆమె పిండం పక్షి ముట్టలే. మా కుటుంబమంతా బాధపడుతున్నది’ అంటూ బెయిల్ పై విడుదలైన అనంతరం సంజయ్ మీడియాతో చెప్పారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.