రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పని చేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏ(VRA)లను క్రమబద్ధీకరణ చేయుటకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని వీఆర్ఏలను క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయించడం పట్ల వీఆర్ఏ(VRA)ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సచివాలయంలో సీఎం కేసీఆర్ (CM KCR)ను వీఆర్ఏల ప్రతినిధులు కలిశారు. క్రమబద్దీకరణ నిర్ణయంపై కేసీఆర్కు వీఆర్ఏలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సచివాలయం(Secretariat)లోని మీడియా పాయింట్ వద్ద వీఆర్ఏల అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ ఉద్యోగాల క్రమబద్దీకరణ (Regularize) విషయంలో ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా క్రమబద్దీకరణ వార్త చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.
ప్రతి వీఆర్ఏ కుటుంబం కేసీఆర్కు రుణపడి ఉంటుంది. ఇవాళ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మరిచిపోలేని విషయం అని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని ప్రతినిధులు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయినందున పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ స్థాయిలో పరిపాలన సజావుగా సాగేందుకు వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేసి రెవెన్యూ శాఖ(Department of Revenue)లో కొనసాగించాలని వారు కోరారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ట్రెసా (Tresa) అనేక మార్లు రిప్రెసెంట్ చేసిందని ట్రెసా ప్రతినిధులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.