కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఛాలెంజ్ విసిరారు. తమ తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. కాంగ్రెస్, బీజేపీ లు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా జరిగిందో లేదో చూపిస్తే… తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ కంటే ఛత్తీస్గడ్, కర్ణాటకలో మెరుగైన సేవలు అందిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవసరం అయితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటా అని దయాకర్ రావు వ్యాఖ్యానించారు.
లేకపోతే మీరు పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని.. క్షమాపణ చెబితే చాలు అన్నారు. ఈ ఛాలెంజ్ కు ఇద్దరు నేతలు సిద్ధమా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మహబూబాబాద్ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహబూబాబాద్ ని కేసీఆర్ జిల్లా చేశారన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టుకున్న మహబూబాబాద్ కి మెడికల్ కాలేజీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలిత, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలను, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను పరిశీలించి బేరీజు వేద్దామన్నారు.
తెలంగాణ పంచాయతీల కంటే మెరుగ్గా ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్, బీజేపీలు రెచ్చగొడుతున్నారు. దేశంలో కేంద్రం ఇచ్చే అవార్డులు అన్నీ తెలంగాణకే వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులు మళ్లించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు ఎర్రబెల్లి. ఇప్పటికే కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్లు రావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రతి నెల ఇవ్వాల్సిన నిధులను ఇస్తున్నామని చెప్పారు.