»Ktr Released The Progress Report Of The It Department
Hyderabad : ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్..ఐటీలో మేటి హైదరాబాద్
దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాల కల్పనలో గత సంవత్సరం 33% ఉద్యోగాలు తెలంగాణ నుంచి ఏర్పాటు అయితే అవి ఈ సంవత్సరం 44 శాతానికి పెరిగాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.
ఐటీ రంగంలో హైదరాబాద్ (Hyderabad) నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.టీ హబ్‌లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ (Minister KTR) విడుదల చేశారు. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ. 56 వేలు కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక లక్ష 83 వేల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్(IT sector)లో 3 లక్షల 20 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 7 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ఐటీ రంగంలో బెంగళూరు(Bangalore)తో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు. కరోనా వచ్చాక ఐటీ రంగంపై అనేక అపోహాలు వచ్చాయి. ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారం ఏమీ లేదు. మాట సాయం తప్ప కేంద్రం ఎలాంటి అండదండలు అందించలేదు.
యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు కేటాయిచిన ఐటీఐఆర్ (ITIR) ను కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ నిలదొక్కుకుని ఐటీ రంగాన్ని అగ్రభాగానా నిలబెట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో జాతీయ సగటును దాటుకొని వెళ్తున్నట్లు తెలిపారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాదును మార్చామన్నారు. అమెరికా(America)కు చెందిన క్వాల్ కామ్, గ్రిడ్ డైనమిక్స్ సహా వివిధ కంపెనీలు భాగ్యనగరం లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. జర్మనీ(Germany)కి చెందిన బాష్ కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. గూగుల్ అతిపెద్ద కేంద్రాన్ని నిర్మిస్తోందని, మైక్రోసాఫ్ట్ (Microsoft) డేటా సెంటర్ వస్తోందన్నారు. మన దేశానికి చెందిన ఎల్ అండ్ టీ వరంగల్ లో పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు. వాషింగ్టన్ (Washington) కు చెందిన రెండు సంస్థలు బెల్లంపల్లిలో పెట్టుబడులు పెట్టనున్నాయని చెప్పారు.