సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఫైరయ్యారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీంతో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే రియాక్షన్స్ మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ లక్ష్యంగా రేణుకా చౌదరి విమర్శలు స్టార్ట్ చేశారు. ఖమ్మంలో అడుగుపెట్టే నైతిక అర్హత కేసీఆర్కు లేదని చెప్పారు. ఎన్నికల సమయంలోనే ఇక్కడి ప్రజలు గుర్తుకు వస్తున్నారా అని అడిగారు. ఇన్నాళ్లు గాలికి ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ మోసం చేయని వర్గం ఏదీ లేదని రేణుకా చౌదరి అన్నారు. చివరికీ జర్నలిస్టులను కూడా చీట్ చేశారని గుర్తు చేశారు. తమ జిల్లాకు చెందిన మీడియా ప్రతినిధులకు కేసీఆర్, కేటీఆర్ కలిసి నాలుగుసార్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత వారి గోడును పట్టించుకోలేదని పేర్కొన్నారు. అక్కడే కాదు మిగతా చోట్ల కూడా జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు జరగలేదు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కానీ మిగతా ప్లేస్కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ కాంగ్రెస్ పార్టీ అలా కాదని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలే కాదు ఇవ్వనివి కూడా చాలా చేశామన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కనిపిస్తాయని.. మరీ కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ సంగతి ఏంటీ అని అడిగారు. అల్లుడు వస్తే కాళ్లు ఎక్కడ పెట్టుకోవాలని కామెంట్ చేస్తారు కదా.. మరీ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటబోతుందని తెలిపారు. ఎంపీ సీట్లతోపాటు 10 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాడే లేదని ఆ పార్టీని విమర్శించారు. చరిత్రహీనులుగా మిగిలిన నేతలు స్టోరీలు చెబుతున్నారని పైర్ అయ్యారు. దేశం కోసం తమ పార్టీ అనేక త్యాగాలు చేసిందని.. బీజేపీ ఏం చేసిందని అడిగారు. ప్రధాని మోడీకి ఆమె సవాల్ విసిరారు. చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. మాటలు కోటలు దాటాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో వివరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని రేణుకా చౌదరి స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట అని.. ఇక్కడి ప్రజలకు తాను అండగా ఉంటానని తెలిపారు. దేశంలో తమ పార్టీ ఓటమికి చేసిన తప్పిదాలే కారణం అని అంగీకరించారు. చెంపలేసుకుని ప్రజల్లోకి వచ్చామని రేణుకా చౌదరి తెలిపారు.
ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభ తక్కువే.. కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ ఎక్కువ. అందుకే కేసీఆర్ తన తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. దీంతో వారికి తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పి, ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అర్థం అవుతోంది. కేసీఆర్ సభ పెడుతున్నారని తెలియగానే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇచ్చారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డ అంటూ చెబుతున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఒంటికాలిపై లేచారు. వారు ఎన్ని కుప్పి గంతులు వేసినా సరే.. జనం వారిని విశ్వసించరని వివరించారు.