కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు రేపుతోంది. మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఇవాళ కూడా ఏడు గ్రామాలకు చెందిన వందలాది రైతులు కామారెడ్డిలో రోడ్డెక్కారు. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ ఆఫీసు ఎదుట రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు ధర్నాకు దిగారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాల స్వీకరణకు ఇవాళే చివరి రోజు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వెయ్యికిపైగా అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీయల్ జోన్, గ్రీన్ జోన్, వంద ఫీట్లపై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. కామారెడ్డి కొత్త టౌన్ ప్లానింగ్‌పై గత కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళన కొనసాగుతోంది. ప్లాన్‌కు వ్యతిరేకంగా అభ్యంతరాలు వస్తోండగా.. మార్చాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోంది.
మాస్టర్ ప్లాన్‌లో ఎవరి భూములు తీసుకోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది. 2000 ఏడాదిలో పాత మాస్టర్ ప్లాన్‌లో ఉన్న వారి భూములు పోలేదని స్పష్టంచేసింది. ఇప్పటికీ ఆ రైతుల పేరు మీదే భూములు ఉన్నాయని అంటోంది. ఆ రైతులు రైతుబంధు తీసుకుంటున్నారని వివరించింది.. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూ సేకరణ కాదని క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీయల్ జోన్ ప్రకటిస్తే పంట పొలాలను లాక్కొరని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కామారెడ్డి కలెక్టర్ వివరించారు. రైతులు మాత్రం తమ భూములు పోతాయని భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలో ఉందని.. ఇంకా ఫైనల్ కాలేదని కలెక్టర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని, మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. భూములు పోతాయని కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తున్న రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ భూముల గురించి తమను సంప్రదించకుండా పంట భూములను రిక్రియషన్ జోన్‌గా ప్రతిపాదించటాన్ని తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వం, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్‌ను ప్రతివాదులగా చేర్చారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసం.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఇలానే జరిగిందని గుర్తుచేసింది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని అభిప్రాయపడింది. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు.