రైతుల సంక్షేమం కోసం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేస్తున్నారు. రాప్తాడు మండలంలో ఆమె తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కనగానపల్లి, రామగిరి మండలాల్లో పాదయాత్రను పూర్తి చేసుకుని ఇప్పుడు రాప్తాడు మండలంలో పర్యటిస్తున్నారు. అయితే తన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని సునీత ఆరోపించారు. తన పాదయాత్రను ఆపాలని ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎవరు ఆపలేరని తెలిపారు.
ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన యాత్రలో పాల్గొనకుండా రైతులను అడ్డుకోవడానికి చెక్ పోస్టులు పెట్టి మరీ ఎక్కడికక్కడే ఆపేస్తున్నారని ఆరోపించారు. ఊళ్లలో చెక్ పోస్టులు పెట్టడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేసారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే రైతులకు మేలు జరగడం కోసం చేపట్టిన తన పాదయాత్రను ఆపేది లేదని సునీత స్పష్టంచేశారు. అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్లడానికీ సిద్ధమని స్పష్టం చేశారు.
జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము ఉందా? అని తోపుదుర్తికి సునీత సవాల్ విసిరారు. మరోవైపు రాప్తాడులో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఇక్కడి అక్రమాలు ఆయనకు కనిపించడంలేదా అని పరిటాల సునీత ప్రశ్నించారు.