తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో బీజేపీ యేతర ప్రభుత్వాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. అందుకు బీజేపీ యేతర పార్టీలతో ఆయన చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో.. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. దేశవ్యాప్తంగా ఉచితంగా కరెంట్ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఢిల్లీ గద్దె మీద కూడా మన ప్రభుత్వమే రాబోతోందన్నారు.
దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్నారు. దేశం కోసం తెలంగాణ నుంచి మనం పోరాటం చేయాలన్నారు. 60 ఏండ్లు మొత్తుకున్న గిరిజన బిడ్డలకు పంచాయతీలను ఏర్పాటు చేయలేదు. 3600 తండాలను పంచాయతీలను ఏర్పాటు చేస్తే 3600 మంది సర్పంచ్లు అయ్యారన్నారు. గురుకుల పాఠశాలలు, కల్యాణలక్ష్మి, రైతుబీమా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. మీటర్లు పెట్టమన్న వారికే మీటర్లు పెట్టాలన్నారు. జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్ గడ్డ మీద నుంచే ప్రారంభిస్తానన్నారు.