లిక్కర్ స్కామ దేశంలో కలకలం రేపుతోంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దసరా తర్వాత సంచలనాలు జరగనున్నాయని గతంలో బీజేపీ నేతలు చెప్పారు. అలాగే జరిగినట్టుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ మరొకరికిని అరెస్ట్ చేసింది.
ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్లలో అభిషేక్ ఒకరు. ఈ ఏడాది జూలై 12న ఈ కంపెనీని స్థాపించారు. ఢిల్లీకి చెందిన జీఎన్‌సీడీటీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కొనసాగుతున్న విచారణలో అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
కొంతమంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేస్తున్న అభిషేక్ బోయిన్‌పల్లిని ఆదివారం విచారణకు పిలిచినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్టుగా సీబీఐ గుర్తించిందని.. రాత్రి అదుపులోకి తీసుకున్నామని సీబీఐ తెలిపింది. నిందితుడిని సంబంధిత కోర్టులో హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐకి ఇది రెండో అరెస్ట్ కావడం గమనార్హం.