CTR: జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలి అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జల జీవన్ మిషన్ పురోగతిపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత పలు అంశాలపై దిశ నిర్దేశం చేసి తగు సూచనలు ఇచ్చారు.
WGL: నర్సంపేట పట్టణంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి మంగళవారం కలకలం రేపింది. పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పట్టణానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి అనుమానాస్పద నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
PLD: యడ్లపాడుకు చెందిన షేక్ శంషాద్‌బీకి సీఎం సహాయనిధి నుంచి రూ.1,03,447 మంజూరయ్యాయి. మంగళవారం ఈ ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల వైద్యానికి కూటమి సర్కారు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నామని ప్రత్తిపాటి ఈ సందర్భంగా తెలిపారు.
కృష్ణా: రైతులకు అవగాహన పెంపొందించేందుకు కిసాన్ గోష్టి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుధారాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ఎన్. రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటవ్వగా, వరి, మినుము పంటలపై చర్చలు జరిగాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమా, జూన్‌కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి దర్శకుడు బుచ్చిబాబు ఓ అప్‌డేట్ ఇచ్చాడు. ఆరు రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుపుతూ.. సెట్‌లో చరణ్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు.
RR: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలలపై నియంత్రణ లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని PDSU రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ అన్నారు. శంకర్‌పల్లి మండలంలో మండల విద్యాధికారి అక్బర్, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి గాలికోది లేసి ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారన్నారు.
MDK: రామాయంపేటలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు జనగణనపై మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం తహసీల్దార్ రజనీకుమారి పర్యవేక్షణలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నిబంధనలకు అనుగుణంగా గణన ప్రక్రియను పూర్తి చేస్తామని సిబ్బందితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. పారదర్శకంగా వివరాలను సేకరించాలని ఎన్యుమరేటర్లకు తహసీల్దార్ దిశానిర్దేశం చేశారు.
SKLM: వజ్రపుకొత్తూరు మండలం సీతంపేటలో జల జీవన్ మిషన్ పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు పనులను ప్రారంభించారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఇందులో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న చిత్తరంజన్ జిల్లా అదనపు SP (అడ్మిన్)గా పదోన్నతి పొందారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించగా, జిల్లా ఎస్పీ నితికా పంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తరంజన్‌ను పలువురు పోలీస్ అధికారులు అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
BPT: పిట్టలవానిపాలెం మండలంలో డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి మద్రాస్ రైలు ఎక్కిన నాగసాయి అనే బాలుడిని చందోలు ఎస్సై శివకుమార్ యాదవ్ గంటల వ్యవధిలో క్షేమంగా గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెన్నైలో ఉన్న బాలుడిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ADB: కుల గణన నిర్వహించిన ఎన్యూమరేటర్లకు వెంటనే గౌరవ వేతనం విడుదల చేయాలని PRTU TS ఉపాధ్యాయ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాథోడ్ అశ్విన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వేతన ఆలస్యం వల్ల ఫీల్డ్ స్థాయిలో పనిచేసిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
SRD: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జిన్నారం ఎస్సై హనుమంత హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కేంద్రంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించాలి అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామన్నారు.
PPM: జిల్లా ఆయుష్ విభాగం అధికారి డా.సుశీల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తన పార్టీ కార్యాలయంలో మలేరియా నివారణకు ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకరంగా మారుతున్న మలేరియా, డెంగ్యూ విష జ్వరాల నివారణకు ఇంటింటికి మందులు పంపిణీ చేయడం సంతోషం అని అన్నారు.
NLR: వెంకటాచలం మండలం పూడిపర్తిలో బీడుగా ఉన్న భూములను సాగులోకి తేవడమే లక్ష్యమని సర్వేపల్లి MLA సోమిరెడ్డి తెలిపారు. జంగిల్ క్లియరెన్స్ పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 230 ఎకరాలు శుభ్రం చేయగా, మరో నెలలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. చెక్ డ్యాం,లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దళిత, గిరిజన భూములకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.
GDWL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం కేటీదొడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో 2 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసి ప్రభుత్వ సాయం పొందాలని కోరారు. లబ్ధిదారురాలు నరసమ్మకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.