కోనసీమ: ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను బుధవారం అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలో తిరగాలని ఆకాంక్షించారు.
E.G: అసెంబ్లీ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం, రైతుల సమస్యలు గురించి సభా దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో డెల్టా ప్రాంతాల నుంచి అందించే సాగునీరు, మోటర్ల పంపింగ్ విషయంలో కౌలు రైతు, సమస్యలు గురించి దృష్టి సారించాలని కోరారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలన్నారు.
KKD: పిఠాపురం నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. పాదగయకు రూ.5 కోట్లు, శ్రీపాద సంస్థానానికి రూ.2 కోట్లు వచ్చాయి. మరో 17 ఆలయాలకు కలిపి మొత్తం రూ.12.75 కోట్లు కేటాయించినట్లు ఈఈ దుర్గేశ్ కుమార్, డీఈ ఉదయ్ కుమార్ తెలిపారు. DY.CM పవన్ కళ్యాణ్ కృషితో వచ్చిన ఈ నిధులకు నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
ATP: ‘జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026’ పోస్టర్లను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ బుధవారం ఆవిష్కరించారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు రైపర్ కళాశాల వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ‘మై భారత్’ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు మార్చి 5న నిర్ణీత సమయానికి పోటీ వేదికకు చేరుకోవాలని సూచించారు.
సత్యసాయి జిల్లాను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తిని పర్యావరణ-ఆధ్యాత్మిక హబ్‌గా మార్చడం, బుక్కపట్నం చెరువులో సత్యసాయి బాబా భారీ విగ్రహ ఏర్పాటుపై చర్చించారు.
NRPT: మేరా యువభారత్ ఆధ్వర్యంలో మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో బుధవారం యువ మండల వికాస్ అభ్యాస్ నిర్వహించారు. జిల్లా కోఆర్డినేటర్ అనిల్ గౌడ్, నేతాజీ వచన సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు మాట్లాడారు. గ్రామ యువ కమిటీలను మేరా యువభారత్‌తో అనుసంధానం చేసి, యువతకు ప్రోత్సాహం, ఉద్యోగ, క్రీడా అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.
NLG: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని 30వ డివిజన్ ఇన్‌ఛార్జ్ షేక్ జాంగిర్ బాబా డిమాండ్ చేశారు. షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం అందించాలని, ఇమామ్, మౌజంల వేతనాన్ని రూ. 6 నుంచి రూ. 12 వేలకు పెంచాలని కోరారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ELR: నూరు శాతం పన్ను వసూలుచేసి ఉంగుటూరు గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శంగా నిలుస్తామని గ్రామ సర్పంచి బండారు సింధు మధుబాబు అన్నారు. బుధవారం ఉంగుటూరు పంచాయతీ కార్యాలయంలో ఇంటి పన్ను కులాయి పన్ను వసూలపై సమీక్ష సమావేశం జరిగింది. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు మాట్లాడుతూ.. పన్ను వసూళ్లలో గ్రామం ఆదర్శంగా నిలిచింది అన్నారు.
విజయనగరంలోని ఓ కళాశాలలో పాల ఉత్పత్తులలో కల్తీని గుర్తించడంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహార భద్రత నియంత్రణాధికారిణి S.ఈశ్వరి పర్యవేక్షణలో జిల్లా ఆహార భద్రత అధికారి పి. వెంకటరమణ విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. నిత్యం మనం వాడే పాలలో నీరు, యూరియా, స్టార్చ్, డిటర్జెంట్ వంటి హానికర పదార్థాలను ఎలా కలుపుతున్నారో వివరించారు.
CTR: జిల్లా తాలూకా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్సై టీజీ మనోహరన్‌కు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ తూషార్ డూడి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ₹1 లక్ష తక్షణ సహాయం అందజేశారు. పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
GNTR:మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థినులతో సమస్యలపై చర్చించారు. స్వీయరక్షణ శిక్షణ ఇచ్చారు. బాల్యవివాహం నేరమని, మహిళలపై మోసాలు, సైబర్ నేరాలపై వివరించారు. సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరానికి 112కు కాల్ చేయాలని తెలిపారు.
PLD: బ్యాంకులకు నిర్దేశించిన అన్ని రకాల రుణాల లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం జిల్లా డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో ఎంపీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
PPM: సీతానగరం మండలంలోని కోట సీతారాంపురం గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ఒక సంపూర్ణ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, వాటిపై తీసుకున్న చర్యలు వివరించాలని అధికారులను కోరారు. బుధవారం ఆయన ఛాంబరులో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
విశాఖలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఔట్‌గేట్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. మండుటెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు బైఠాయించారు.
AKP: మాడుగులలో నిర్మాణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను పనులను టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి పుప్పాల రమేష్ పరిశీలించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కృషితో రూ.65 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఉగాది పండుగకు ముందే పనులు పూర్తి చేసి అదే రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.