PLD: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బొల్లాపల్లి మండలం రెడ్డిపాలేనికి చెందిన మధు, తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పొలాలకు వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన బయటపడింది.
TG: HYDలో సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.5 లక్షల విలువ చేసే 12.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన వ్యక్తుల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
SRCL: సిరిసిల్ల విద్యానగర్‌లోని అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఇందిరమ్మ కాలనీలోని సొంత స్థలానికి తరలించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నిర్వహించవద్దన్న సర్కార్ ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సొంత భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా కంటైనర్‌ను కార్యాలయం కోసం వినియోగించనున్నారు. త్వరలోనే సేవలు అందిస్తారు.
MNCL: భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీని MPDO మధుసూదన్ బుధవారం సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి, నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో APO జీనత్, హౌసింగ్ AE రుచిత, పంచాయతీ కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు.
SRPT: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అన్తెతిక చర్యలకు పాల్పడిన మోతే మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రకటించారు. బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ.. ఇవాళ నుంచి ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన చర్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.
KMR: కెమికల్ పరిశ్రమలతో ప్రాణాలు పోతున్నాయని నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమల అనుమతులు రద్దు చేయాలని మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ సాయ గౌడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి గ్రామ సచివాలయ పాలకవర్గ తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
JGL: జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ఎల్లమ్మ తల్లి పట్నాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు.
SRCL: బోయినిపల్లి మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, భూ భారతి రిజిస్ట్రేషన్ గది, కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యాలయానికి వచ్చే వారికి సేవలు అందించాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి అందుబాటులో ఉండాలన్నారు.
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అణు జలాంతర్గామి వద్ద ఉన్న ఫొటోను ఫ్రాన్స్ రాయబార కార్యాలయం విడుదల చేసింది. అంతేకాకుండా, మధ్యధరా సముద్రంలోకి చార్లెస్ డీ గల్లె యుద్ధనౌకను పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ కదలికలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
SDPT: మక్కలకు కనీస మద్దతు ధర (MSP) చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని సాగు చేసిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని విమర్శించారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమైన రేవంత్ సర్కార్, పంట కోత దశకు వచ్చినా పెట్టుబడి సాయం అందించలేకపోవడం దారుణమని మండిపడ్డారు.
ASF: కౌటాల మార్కెట్‌లో స్వచ్ఛభారత్ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గతేడాది నిర్మాణం పూర్తయినా నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు,వారసంతకు వచ్చే వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో కనీసం నీటి సౌకర్యం, మూత్రశాలలు లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అధికారులు స్పందించి మరుగుదొడ్లను ప్రారంభించాలన్నారు.
HYD: కాచిగూడలోని శ్రీ ఉత్తరాది మఠంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యా యి. ఉదయం స్వామివారికి అంకురార్పణం, పుణ్యాహవచనంతో ప్రత్యేక పూజలు చేసి, యాగం చేసి బ్రహ్మోత్సవాలను వేద పండితులు ప్రారంభించారు. 6వ తేదీన శుక్రవారం శ్రీ స్వామివారి కళ్యాణం ఉంటుందని జయ తీర్థచార్య తెలిపారు.
ASF: జిల్లా కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగుల హక్కులపై సమీక్ష సమావేశం జరిగింది. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్ హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేయూత పింఛన్ కేంద్రాల్లో తాగునీరు,సదరం శిబిరాల్లో వీల్చైర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
NLR: నెల్లూరు నవాబుపేటలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనులపై కమిటీ సభ్యులతో చర్చించారు. సుమారు 100 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో 2024లో భక్తుల సహకారంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. టీటీడీ దృష్టికి తీసుకెళ్తే తగిన సాయం అందుతుందని సూచించారు.
NZB: రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసిందని కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈ శిబిరంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా చరఖాతో దారం తీయడం నేర్పించారన్నారు. చివరి రోజు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.