NGKL : జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11 న ఉదయం 9 గంటలకు రాంనగర్ కాలనీలోని శోభ ఆప్టికల్ వద్ద ఉచిత కంటి శిబిరం నిర్వహించనున్నారు. క్యాటరాక్ట్ బాధితులను మహబూబ్ నగర్ లయన్ రాంరెడ్డి ఆస్పత్రికి పంపి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్, ఓటర్ లేదా రేషన్ కార్డు జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని నిర్వాహకులు కోరారు.
SGR: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన ప్రీ ప్రైమరీ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. సంగారెడ్డిలో ప్రీ ప్రైమరీ టీచర్ల శిక్షణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను ఫ్రీ ప్రైమరీలో చేర్పించాలన్నారు.
ADB: గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేరడీగొండ మండల కేంద్రంలోని ప్రత్యేక మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొని సమావేశంలో మాట్లాడారు. మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
GDWL: భారత విప్లవ యోధుడు కామ్రేడ్ రాయల్ సుభాష్ చంద్రబోస్ (రవన్న) 10వ వర్ధంతి సభను గద్వాలలో CPI(ML) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి హనుమంతు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి ఉద్యమం స్థాయి నుంచి సాయుధ దళపతిగా ఎదిగిన రవన్న సేవలను స్మరించారు.
KNR: గంగాధర మండలంలోని కాచిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు పెద్ది సత్తవ్వ-మల్లేశం దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. నిరుపేదల సొంతింటి కలలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమకు గృహయోగం కల్పించినందుకు లబ్ధిదారుల కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది.
NGKL: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నిపుణుల వైద్య సేవలను వారి ముంగిటకే చేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
MBNR: పొన్నాకల్ స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన రవి, నాగన్న కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
CTR: పెద్దపంజాణి మండలంలోని బొమ్మరాజు పల్లెలో వైసీపీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ మాట్లాడుతూ.. మార్చి 8 లోపు వైసీపీ గ్రామ కమిటీల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీ యూనిట్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కమిటీలలోని సభ్యులకు పార్టీ అధిక ప్రాధాన్యమిస్తుందని వెల్లడించారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
KMM: శ్రీస్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపు సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ గావిస్తారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు కొండపై స్వాతి నక్షత్ర జ్యోతిని వెలిగిస్తారని ఆలయ ఈవో తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
WGL: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాన్ని దరఖాస్తుదారులు సులభంగా తెలుసుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాల్సిందిగా మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా సాఫ్ట్ వేర్ రూపొందించాలని అన్నారు.
సత్యసాయి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా ఫయాజ్ భాష నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని ఆయన తెలిపారు.
NLR: కోవూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లివాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గంలోని మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ. 6.50 కోట్లు మంజూరు చేసేందుకు మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అమరావతిలో మంత్రిని కలిసి నిధులపై విన్నవించారు. స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
BDK: 10 రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో శుక్రవారం దమ్మపేట పంచాయతీ పారిశుధ్య సిబ్బందితో కలిసి పాలక వర్గ సభ్యులు, కార్యదర్శి ప్రధాన సెంటర్ బాలాజీనగర్ రోడ్డుకు ఇరువైపుల చెత్తను తొలగించి శుభ్రం చేసే డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బండి అనంత్ కుమార్ మాట్లాడుతూ, నేటి నుండి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
HNK: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నేటి నుంచి జూన్ 12 వరకు నాలుగు దశల్లో వైద్య శిబిరాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని HNK జిల్లా డాక్టర్ అప్పయ్య తెలిపారు. మొదటి దశలో నేటి నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.