BHPL: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్‌లో ఇవాళ లిఫ్ట్ వైర్ తెగి జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆరుగురు మీడియా ప్రతినిధులు 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన జర్నలిస్టులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
SRPT: ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలపై సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్’ పోటీల్లో పీఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థి గంట సాత్విక్ ప్రతిభ చాటారు. జర్మనీ పర్యావరణ సమస్యలపై ప్రసంగించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా సాత్విక్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.
MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య పేర్కొన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచుతానని చెప్పి విస్మరించారన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మందకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.
SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులోని డా. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ముందుగా కళాశాలలోని సాయిల్ సైన్స్, ఎంటమాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ విభాగాన్ని కలెక్టర్ సందర్శించారు.
JN: స్టేషన్ ఘన్‌పూర్ మాజీ MLA తాటికొండ రాజయ్య శ్రీహరికి ఘాటు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కండువా వేసుకోవాలి, లేకుంటే గాజులు ధరించాలని వ్యంగ్యంగా విమర్శించారు. కడియం నీతిమాలినవాడని, కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ పునాది అని, కడియం సిగ్గుంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.
TG: గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలని, పూర్తిస్థాయిలో సేవలు అందించినప్పుడే ప్రజల గుర్తింపు లభిస్తుందన్నారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి కేంద్రం నుంచి నిధులను తీసుకువస్తామన్నారు.
JGL: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్ట్కార్డుల ఉద్యమం చేపట్టినట్లు కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ తెలిపారు. కోరుట్ల పట్టణంలో గురువారం జిల్లా న్యాయవాది మధుసూదర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. భావితరాలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో ప్లాస్టిక్ తగ్గించడం అవసరమన్నారు.
PPM: జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు మన్యం జిల్లా ఎక్సైజ్, ఒడిశా ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా అంతరాష్ట్ర దాడులు గురువారం నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 4800 లీటర్ల బెల్లపు ఊట, 170 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శిరీష తెలిపారు.
ELR: గత ఆర్ధిక ఏడాది వివిధ శాఖల ద్వారా రూ.18.45 కోట్ల విలువ గల 1013 ఉపాధి హామీ పనులు చేపట్టామని భీమడోలు ఎంపీడీవో పద్మావతి దేవి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రజా వేదిక పేర నిర్వహించారు. తనిఖీ కార్యక్రమాలను ఉపాధి హామీ పథకం సహాయ పధక సంచాలకులు శ్రీనివాస్ నిర్వహించారు.
E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం గురువారం విజయవంతంగా జరిగింది. స్థానిక GNR కళ్యాణ మండపంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ చిక్కాల సూరిబాబు, ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ, కార్యదర్శిగా ఏ.సూర్యచంద్ర రావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
KDP: చాపాడు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్‌లో రూ.2.40 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. స్కూల్ అభివృద్ధికి మినీ ట్రాన్స్‌ఫార్మర్, ఆటస్థలం అభివృద్ధి, స్టేజ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
KKD: రాజస్థాన్ జలోర్ నుంచి మొదలు పెట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రముఖ దేవాలయాలు పాదయాత్ర చేస్తున్న కేసా రామ్ పిఠాపురం చేరుకున్నారు. కేసా రామ్‌కు మార్వాడీ విష్ణు సమాజ్, విశ్వ హైందవ పరిషత్ నాయకులు కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. కేసా రామ్ మాట్లాడుతూ… మన దేశం సురక్షితంగా ఉండాలని పాదయాత్ర చేస్తున్నానన్నారు.
అన్నమయ్య: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నూతన స్కౌట్ యూనిట్లను ప్రారంభించేందుకు మార్చి 31 వరకు గడువు ఉందని జిల్లా సెక్రటరీ M. నరసింహారెడ్డి తెలిపారు. కొత్తగా చేరాలనుకునే పాఠశాలల ప్రతినిధులు ఈనెల 13న మధ్యాహ్నం 1 గంటకు రాయచోటిలోని డైట్ (DIET) నందు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలి. రూ.381 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని పొందవచ్చన్నారు.
W.G: తాడేపల్లిగూడెం పుర దేవత బలుసులమ్మవారి జాతర ఉత్సవాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. తొలుత అమ్మవారికి కుంకుమ అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు కుటుంబ సభ్యులు జాతరకు రూ.5 లక్షలు తొలుత విరాళంగా ప్రకటించారు.
KMR: నాగిరెడ్డిపేట మండలం బొల్లారం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్ నాయకులు పేరుపల్లి సాయిబాబా అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహా నేతల ఆదర్శాలను పాటించాలన్నారు. విజ్ఞానంతోనే సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. చదువులు అలవర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.