అప్పుడు కెజియఫ్.. ఇప్పుడు కాంతార.. ప్రస్తుతం అంతటా ఇదే మాట వినిపిస్తోంది. కాంతార అనే కన్నడ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది. కెజియఫ్ తర్వాత సంచలనం సృష్టించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏకంగా కెజియఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాలను వెనక్కి నెట్టి రికార్డు క్రియేట్ చేసింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారకు.. బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.
కన్నడనాట సెప్టెంబర్ 30న విడుదలై.. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం.. తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది. కెజియఫ్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాను.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రభాస్.. మరోసారి తెలుగు వెర్షన్ కూడా చూశాడు. ‘కాంతార మూవీని రెండోసారి చూసాను.. రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడు.. మూవీ కాన్సెప్ట్ అదిరిపోయింది.. ఇక క్లైమాక్స్ అయితే మరింత అద్భుతం.. ప్రతి ఒక్కరు ఈమూవీని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి..’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రభాస్.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దాంతో తెలుగులో కాంతారకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ‘ఐఎమ్‌డీబీ’ రేటింగ్ ప్రకారం.. కేజీఎఫ్ 2కు 8.4, ఆర్ఆర్ఆర్ సినిమాకు 8 రేటింగ్ ఉండగా.. ఇప్పుడు వీటిని వెనక్కు నెట్టింది కాంతార. ఐఎమ్‌డీబీలో 9.5 రేటింగ్ సొంతం చేసుకొని టాప్ ప్లేస్‌లో నిలిచింది. దీంతో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ చిత్రంగా కాంతార నిలిచింది.