»Govt Teacher Suspended For Facebook Post Criticising Cm Siddaramaiah
Karnataka రాష్ట్రం అప్పులపాలవుతోందని టీచర్ ఆవేదన.. ఉద్యోగం పీకేసిన సీఎం
ఉచితాలు అధికంగా ఇవ్వడంతో కర్ణాటక అప్పుల్లో కూరుకుపోతుందని ఉపాధ్యాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో విద్య శాఖ అధికారులు స్పందించారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్యకు (Siddaramaiah) సమస్యలు స్వాగతం పలికాయి. ప్రమాణం (Oath) చేసిన రెండు రోజులకే వర్షం రూపంలో ఇక్కట్లు ఎదురయ్యాయి. తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (Govt Teacher) సిద్ధరామయ్య పాలనను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఈ సంఘటన కర్ణాటకలో కలకలం రేపింది.
చిత్రదుర్గ జిల్లా (Chitradurga District) కనుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఎంజీ శాంతమూర్తి (MG Shantha Murthy) ‘ఉచితాలు ఇవ్వకుండా ఇంకేం చేయగలం’ అనే పేరుతో ఓ వీడియోను ఫేస్ బుక్ లో పోటీ చేశాడు. కర్ణాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి కాలంలో జరిగిన అప్పుల (Debt) విషయమై ప్రస్తావించారు. ముఖ్యంగా సిద్ధరామయ్య హయాంలో అత్యధికంగా అప్పులు జరిగాయని ఆరోపించారు. ‘ఎస్ఎం కృష్ణ (SM Krishna) హయాంలో రూ.3,590 కోట్లు, ధరమ్ సింగ్ సమయంలో రూ.15,635 కోట్లు, కుమారస్వామి ప్రభుత్వంలో రూ.3,545 కోట్లు, యడియూరప్ప హయాంలో రూ.25,653 కోట్లు, సదానందగౌడ కాలంలో రూ.9,464 కోట్లు, జగదీశ్ షెట్టర్ ప్రభుత్వంలో రూ.13,464 కోట్లు అప్పులు జరిగాయి. ఇక సిద్ధరామయ్య ప్రభుత్వంలో రూ.2,42,000 కోట్లు అప్పులు చేశారు’ అని శాంతమూర్తి ఆరోపించారు.
ఉచితాలు (Free Schemes) అధికంగా ఇవ్వడంతో కర్ణాటక అప్పుల్లో కూరుకుపోతుందని ఉపాధ్యాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో విద్య శాఖ అధికారులు స్పందించారు. ప్రభుత్వం ఆరోపణలు చేసిన శాంతమూర్తిని సస్పెండ్ (Suspend) చేస్తున్నట్లు ఆ జిల్లా విద్యా శాఖ అధికారి జయప్ప తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘనకు ఆయన పాల్పడడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.