దేశంలో ఎన్నికల పర్వం మొదలౌతోంది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఎన్నికల నగారా మోగింది. గుజరాత్(Gujarat) అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో మొత్తం ఓటర్లు 4.90 కోట్ల మంది ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. 51,782 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 5,11 తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడత ఎన్నికలు జరిగే నియోకవర్గాల్లో 14వ తేదీ వరకు, రెండో విడతకు 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఈ నెల 17,21 తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువుగా ప్రకటించారు. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. 2017 డిసెంబర్ 9న గుజరాత్ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీ కాలపరమితి 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుత సభలో బీజేపీకి 99 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ కు 77 సీట్లు ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఆప్ తమ సత్తా చాటేందుకు సిద్దమయింది.
ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ – ఆప్ హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోదీ గుజరాత్ లో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్త హామీలు, సరి కొత్త డిమాండ్లతో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గుజరాత్ పైన గురి పెట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షుడుగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తరువాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు ఇవి. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నిమగ్నమయ్యారు. ఎలాగైనా తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. ప్రధాని మోదీ – అమిత్ షాకు సొంత రాష్ట్రంలోనే జలక్ ఇవ్వాలని కాంగ్రెస్ – ఆప్ భావిస్తున్నాయి. దీంతో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మూడు పార్టీలకు కీలకంగా మారటంతో హోరీ హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.