వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తమకు అసలు పోటీనే కాదు అని అని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు పరిపాలించడం చేత కాదని… అందుకు ప్రజలు ఆయనకు బైబై చెప్పారని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు పోటీలో ఎక్కడా లేడని తేల్చి చెప్పారు. అధికారం అనేది ఇద్దరు వ్యక్తులు నిర్ణయించేదు కాదని, ప్రజలు నిర్ణయించాలన్న స్పృహ చంద్రబాబుకు లేదని సజ్జల అన్నారు. చంద్రబాబుకు అధికారం అప్పనంగా రావటం వల్ల ఈ అహంకారం ఏర్పడిందని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలు అని చంద్రబాబు తనకు తానే ఒప్పుకున్నాడని సజ్జలు గుర్తుచేశారు. కుప్పంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలుపుకోలేక పోయిన వ్యక్తి, పులివెందుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇప్పటం విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలనున్న ప్రయత్నం మరోసారి బయటపడిందని, కోర్టు తీర్పుతో ఈ విషయం తేలిపోయిందని సజ్జల అన్నారు. ఆక్రమణలను తొలగించటానికి అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని సజ్జల గుర్తుచేశారు. సభకు భూమి ఇచ్చిన వారిలో ఎవరి ఇల్లు కూలిందో పేర్లు ఇవ్వమంటే పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు.
మైలవరంలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత కలహాలపై కూడా సజ్జల స్పందించారు. వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ ఇద్దరూ మంచి నాయకులేనని, ఇద్దరితోనూ మాట్లాడానని, అపోహలు ఉంటే తొలగించుకోవాలని చెప్పానని సజ్జల వెల్లడించారు.