హరిహరవీరమల్లు పరిస్థితేంటి……ఇదే ప్రస్తుతం పరిశ్రమలో బాగా జోరందుకున్న టాక్. ఎందుకంటే, కర్నాటక ప్రభుత్వం నిన్న ఓ బాంబు పేల్చింది. 200 రూపాయల కన్నా ఏ చిత్రానికి టిక్కెట్టు రేట్ ఉండడానికి వీల్లేదు అని. అది ఏ భాషా చిత్రానికైనా సరే ఒకటే రూలు. అది కన్నడ సినిమా అయినా, కన్నడంలోకి డబ్ అయిన సినిమా అయినా. కోటానుకోట్ల రూపాయాల బడ్జెట్టు, ఐదేళ్ళ నిర్మాణ కాలం, వడ్డీలు, వ్యయప్రయాసలు, మాటిమాటికీ మారిన డేట్లు ఇన్ని అవరోధాలను, ఆటంకాలను దాటుకుని హరిహరవీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతోంది.
నిర్మాత రత్నం ఈ సినిమా విషయంలో ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఒకటి రెండూ కావు పవన్ కళ్యాణ్ రాజకీయరంగ వ్యాసంగం వల్ల చాలా రోజుల పాటు ఆయన గురించి ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ఈలోగా ఉన్న వర్క్ అంతా పూర్తి చేసుకోగలిగారు. అది వరకూ ఓకే. కానీ, హీరో వర్కే అధికబాగం ఉంటుంది కాబట్టి ఆ జాప్యం, ఆలస్యం తప్పలేదు రత్నంకి నిర్మాతగా, కానీ, మీటర్ రన్ అవుతుంటుంది కదా. వడ్డీలు భూచక్రాల్లా తిరిగి తిరిగా తడిసి మోపెడయ్యాయి. రత్నం నిర్మాతగా తన ప్రాడెక్టు మీదున్న అపారమైన నమ్మకంతో ఎక్కడా తొణకలేదు కానీ మరో నిర్మాతైతే ఎప్పుడో చేతులెత్తేసేవాడు. మొదట్లోనే తొలి దర్శకుడు క్రిష్ పక్కకి తప్పుకోవడం జ్యోతికృష్ణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, ప్రాజెక్టుని సక్రమంగా, సవ్యంగా పూర్తి చేయగలిగాడు గానీ లేకపోతే రత్నం పరిస్థితి ఏంటి ఈ రోజున. ఇబ్బందుల్ని సజావుగా అధిగమించగలిగే ఒడుపు, నైపుణ్యాన్ని తెచ్చిపెట్టిన అనుభవం ఉంది కాబట్టి రత్నం ఛాలెంజెస్‌ని అవకాశాలుగా మార్చుకుని హరిహరవీరమల్లుని గ్రాండ్ రిలీజ్ వరకూ తీసుకొచ్చారని పరిశ్రమంతా ఆయన్ని అభినందనలలో ముంచెత్తుతున్నారు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పటికే రత్నం ముఖ్యమంత్రులను కలవడం జరిగింది. టిక్కెట్ రేట్ల పెంపు విషయమై ఆయనకి ఆ అంగీకారం లభించింది. కానీ, కన్నడలో విడుదలైనప్పుడు ఈ భారీ బడ్జెట్ చిత్రం 200రూపాయల హయ్యస్ట్ రేట్‌తో నెగ్గుకు రాగలదా అనేదే ప్రధానమైన చర్చగా ఇప్పుడు పరిశ్రమలో నడుస్తోంది. కానీ, కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన జీవోలో అయితే ఇది అమలులోకి రావడానికి ఇంకా కొన్ని వారాలు పడుతుంది, ఈ లోగా హరిహరవీరమల్లు విడుదలైపోతుంది. కాబట్టి ఈ తాజా నిర్ణయం వీరమల్లుకి వర్తించదు అనేది కూడా సుస్ఫస్టంగా కనబడుతోంది. ఏ రకంగానూ వీరమల్లుకి జరిగే నష్టమేమీ లేదనేది అందరూ తేల్చేశారు.