తాను ఇప్పటివరకు తన కూతురు రాహా చూసి ఎంజాయ్ చేసే సినిమాలు చేయలేదని బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పారు.అందుకే తను చూసి నవ్వుకునే సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నానని, ఇకపై కామెడీ కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు పేర్కొన్నారు. త్వరలోనే వాటి పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.
నటులు మౌళి తనుజ్, శివాని నాగరం ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈ మూవీ యువతను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ. 2015 నాటి ఇంటర్, ఎంసెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ ప్రేక్షకులను అలరిస్తుంది. రొటీన్ కథాంశం అయినప్పటికీ, సరదా సంభాషణలు, స్క్రీన్‌ప్లేతో నవ్వించారు. క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. రేటింగ్ 3.5/5.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ లైవ్ యాక్షన్ మూవీ ‘లిలో అండ్ స్టిచ్’ OTTలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీ మే 23న రిలీజై ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9123 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించింది. రూ.100లోపు ఉన్న మూవీ టికెట్లపై GSTని తగ్గించింది. వాటిపై ఉన్న 12% GSTని 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 18% GST కొనసాగనుంది. మల్టీప్లెక్స్‌లు, ప్రీమియం థియేటర్లలపై ప్రభావం లేదు. మరోవైపు సాల్ట్ పాప్‌కార్న్ 5% శ్లాబ్‌లోకి, క్యారమిల్ పాప్‌కార్న్ 18%లోకి వస్తుంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’. ఆగస్టు 14న రిలీజైన ఈ మూవీ పర్వాలేదనిపించింది. తాజాగా ఈ చిత్రం OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఈ నెల 11 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
తనపై ప్రేమ చూపించిన మొదటి ప్రేక్షకులు తెలుగువాళ్లే అని మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ చెప్పారు. ‘కొత్త లోక’ మూవీ సక్సెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాను భారీ విజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజుల తర్వాత తెలుగువాళ్లను కలవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉందని, కానీ మంచి కథ దొరకడం లేదని తెలిపారు.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న రిలీజై మంచి హిట్ అందుకుంది. ఇటీవల సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఈ మూవీ OTTలోకి రాలేదు. దీంతో నెటిజన్లు.. ఈ మూవీ OTTలోకి ఇంకా రాలేదు ఏంటంటూ?.. చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
TG: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో హీరో రాజ్‌తరుణ్‌పై మరో కేసు నమోదైంది. రాజ్‌తరుణ్ తన కుక్కను చంపేశాడని లావణ్య ఫిర్యాదు చేసింది. తన తండ్రిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లారని ఆరోపించింది. కాగా ఇప్పటికే రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
‘వేదం’ సినిమాలో అనుష్క.. సరోజ(వేశ్య) పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. తాజాగా ‘వేదం’ డైరక్టెర్ క్రిష్ దర్శకత్వంలో ఆమె ‘ఘాటి’ చిత్రంలో నటించింది. ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. ‘వేదం’ సరోజ పాత్రతో మరో చిత్రాన్ని చేయమని క్రిష్‌ను అడిగినట్లు తెలిపింది. అయితే, క్రిష్ మాత్రం ‘ఘాటి’ తీసినట్లు చెప్పుకొచ్చింది.
TG: మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి నాగార్జున, నాగచైతన్య నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. న్యాయమూర్తి ముందు తమ వాంగ్మూలం సమర్పించారు. కాగా, ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.
నటి కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కొత్త లోక’. ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. థియేటర్లలో విడుదలైన 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ వెలువడింది. ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రానికి డొమినిక్ అర్జున్ దర్శకత్వం వహించారు.
తాను చెప్పుతో కొట్టుకున్న వీడియోపై దర్శకుడు మోహన్ శ్రీవత్స క్లారిటీ ఇచ్చారు. ప్రేక్షకుల కొత్తగా అందించాలని తాను ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీని తీసినట్లు తెలిపారు. మలయాళ మూవీకి వచ్చిన ఆదరణ తన సినిమాకు రాకపోయేసరికి తట్టుకోలేకపోయానని, ఎవరూ ఈ చిత్రం గురించి స్పందించడం లేదనే బాధలో అలా చేసినట్లు చెప్పారు. తన వీడియో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అని పేర్కొన్నారు.
‘వేదం’ సినిమాలో అనుష్క శెట్టి పోషించిన సరోజ పాత్రకు సీక్వెల్ ప్లాన్ చేయాలని అనుకున్నట్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలిపారు. ‘ఊరి చివర ఇల్లు’ అనే నవలలో ‘రమ్య’ అనే వేశ్య పాత్రను ప్రేరణగా తీసుకుని.. సరోజ పాత్ర ఆధారంగా మంచి లవ్ స్టోరీని రాశానని చెప్పారు. కానీ ఆ పాత్రను చెడగొట్టేస్తామేమోనని డ్రాప్ అయినట్లు పేర్కొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 33.34 పాయింట్లు నష్టపోయి 80,126 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 5.9 పాయింట్ల నష్టంతో 24,573 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.12గా ఉంది. కాగా, GSTలో నూతన సంస్కరణలపై ఇవాళ, రేపు GST మండలి భేటీలో చర్చల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన ఫొటోలు ఇ-కామర్స్ వెబ్సైట్లలో చూసి షాక్ అయినట్లు నటి సోనాక్షి సిన్హా తెలిపారు. తనను సంప్రదించకుండా, కనీసం తన అనుమతి లేకుండా తన ఫొటోలు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, వాటిని వెంటనే తొలగించాలని తెలిపారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.