నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. వీరసింహుడి ఉగ్రరూపం చూసేందుకు రెడీ అయిపోయారు. ఒక అభిమానిగా ఈ సినిమాను ఎలా తెరకెక్కించానో.. వెండితెరపై చూస్తారంటూ.. భారీగా అంచనాలను పెంచుతూ వచ్చాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. పైగా దిల్ రాజు ‘వారసుడు’ రేసు నుంచి తప్పుకోవడంతో.. వీరసింహారెడ్డికి లైన్ క్లియర్ అయింది. అజిత్ ‘తెగింపు’ థియేటర్లో ఉన్నా.. జనవరి 11 వరకే దాని టాక్. ఇక12న మాత్రం వీరసింహారెడ్డి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాలయ్య కెరీర్లో వీరసింహారెడ్డిదే హైయెస్ట్. మొత్తంగా వీరసింహాకు వచ్చినంత బజ్ ఇంతకు ముందు బాలయ్య సినిమాలకు లేదనే చెప్పాలి. ఇవన్నీ కూడా బాలయ్య సినిమాకు కలిసొచ్చే అంశాలే. అందుకే ఇప్పుడు అందరి దృష్టి వీరసింహారెడ్డి ఫస్ట్ డే ఓపెనింగ్స్ పైనే ఉన్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. వీరసింహారెడ్డికి మొదటి రోజు 25 నుంచి 30 కోట్ల కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అంతేకాదు ఈ ఫిగర్ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. బాలయ్య ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాయడం ఖాయమంటున్నారు. అయితే నెక్స్ట్ డే మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ వస్తుంది కాబట్టి.. కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీరసింహారెడ్డి ఫస్ట్ డే ఎంత రాబడుతుందో చూడాలి.