BHPL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని SP సంకీర్త్ తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు.
WNP: పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన 21 ఏళ్ల అనూషకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌ను సంప్రదించారు. సమయానికి చేరుకున్న 108 సిబ్బంది అనూషను వనపర్తి నరసింగపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, మరిన్ని 108 సేవలను వినియోగించుకోవాలని జిల్లా మేనేజర్ రత్నమయ్య తెలిపారు.
JN: తాడిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన పూజారి రమేష్ ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడు దీంతో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఎంజీఎంకు తరలింగారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
NGKL: కొల్లాపూర్ మండలం సోమశిలలోని రామాలయంలో శ్రీ వీర అభయాంజనేయస్వామి ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ వెంకటలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు.
MHBD: తెలంగాణ శాసనసభ ఆధ్వర్యంలో ఈనెల 28, 29న నిర్వహించనున్న ‘క్రీడలు, ఆటలు, సంస్కృతిక ఉత్సవాల’ నిర్వహణ కమిటీ సభ్యురాలిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి అసెంబ్లీ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రతిష్టత్మకమైన ఈ ఉత్సవాల నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.
MBNR: ప్రజలు శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది రంజాన్ పండుగలను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకున్నారని అదేవిధంగా రాబోయే బక్రీద్ హనుమాన్ జయంతి శ్రీరామనమే వేడుకలు కూడా జరుపుకోవాలని సూచించారు.
NRPT: మద్దూర్ మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన చిన్నారి ప్రసన్న థలసేమియా వ్యాధితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న అభంగాపూర్ యువకులు బుధవారం తమ వంతు సహాయంగా రూ.31 వేలు కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సేవా భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
NRML: జిల్లాలో ఇసుక అమ్మకాలను ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పారదర్శకత కోసం ఆన్‌లైన్ కూపన్లు జారీ చేయాలని, భూ భారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను నిర్ణీత సమయంలో అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
GDWL: ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు భవిష్యత్తులో అధికారులుగా మారి ప్రజలకు సేవ చేయాలని ఎంఈవో భగీరథరెడ్డి అన్నారు. రాజోలి (M) నసనూరులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో హాజరయ్యారు. స్కావెంజర్ విషయంలో గ్రామ ప్రజల మధ్య ఉన్న అనిశ్చితిని సామరస్యంగా ఎంఈవో పరిష్కరించారు.
SRD: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలందరికీ తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మిషన్ మోడ్‌లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల హెల్త్ ప్రొఫైల్, డిజిటల్ హెల్త్ కార్డుల పురోగతిని సమీక్షించారు.
SRPT: కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని కోదాడ మండల విద్యాధికారి ఎండీ సలీం షరీఫ్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచడం కోసం ముందస్తుగా ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
SRPT: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద తిరుమలగిరి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసింది. ఈ పథకం కింద వాటర్ ట్యాంకులు, సంపులు, పైపులైన్లు నిర్మించాల్సి ఉంది. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 2024 జూన్‌లో ఈ పథకం ప్రారంభమైనా.. నేటికి పనులు పూర్తి కాలేదు. దీంతో వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.
WGL: వరంగల్ నగరంలోని కొత్తవాడలో ఇంటి పన్ను వసూలు కోసం వచ్చిన మున్సిపల్ సిబ్బందిపై బుధవారం స్థానికులు దాడి చేశారు. బొట్ల శ్రవణ్, అతని తండ్రి ఆశీర్వాదం ఇంటి పన్నుకు రూ.12,000 బకాయిలు చెల్లించాలని కోరగా, సిబ్బందిపై ఆగ్రహంతో విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని దూషించడం, మరో మున్సిపల్ ఉద్యోగిపై భౌతిక దాడి చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కామారెడ్డి: జిల్లాలోని డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు డాక్టర్ శ్రీలేఖ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10:30 గంటల నుండి ప్రారంభమవుతుందన్నారు. కావున డోంగ్లి పీహెచ్సీ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, ఫోన్ తీసుకురావాలన్నారు.
యాదాద్రి: కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం గాను ఆస్తి పన్నులు వసూళ్ళలో భాగంగా గత సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, బకాయి అస్థి పన్ను చెల్లించని వారికి వారంలో చెల్లించవలసినదిగా తెలియజేస్తూ రెడ్ నోటీసు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పన్ను చెల్లించకపోవడంతో వారి ఆస్తులను ఆలేరు మున్సిపాలిటీ సిబ్బంది సీజ్ చేశారు.