• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్రామాలలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట, చందారం, దౌడేపల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. మంగళవారం ఆయన ఆయా గ్రామాలలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వెంకట్రావు పేట పీహెచ్ సీని సందర్శించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

March 17, 2026 / 07:49 PM IST

సర్పంచ్ ను సత్కరించిన మానుకోట ఎస్పీ

MHBD: కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మీ- రాజునాయక్ లను జిల్లా ఎస్పీ డా.శబరీష్ సత్కరించారు. మండల కేంద్రంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ దంపతులు శబరీష్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎస్పీకి వివరించారు. ఈ క్రమంలో ఆయన వారిని శాలువా కప్పి అభినందించారు.

March 17, 2026 / 07:48 PM IST

ఘనంగా మల్లన్న అగ్నిగుండాల ఉత్సవాలు

JGL: కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో మల్లన్న అగ్నిగుండాల కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం వేళ భక్తులు దేవాలయంలో పూజలు చేశారు. దేవాలయం ఆవరణలో అగ్ని గుండం తయారు చేశారు. కోరిన కోర్కెలు తీర్చు స్వామి అంటూ భక్తులు అగ్నిగుండం నుంచి కాలినడకన నడచి వెళ్లారు. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు.

March 17, 2026 / 07:47 PM IST

‘తరోడా దవాఖానపై చర్యలు తీసుకోవాలి’

NRML: ముధోల్ మండలం తరోడా గ్రామ పల్లె దవాఖానలో వైద్య సేవలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని AIPSU నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆశా వర్కర్లే నిర్వహణ కొనసాగుతోందన్నారు. చిన్న సమస్యలకే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే వైద్యుడిని నియమించి నిత్య సేవలు అందించాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

March 17, 2026 / 07:40 PM IST

‘ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలి’

BHNG: ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్ కేటాయించాలని మంగళవారం CITU ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న పట్టణాల్లో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు సరైన వేతనాలు లేవన్నారు.

March 17, 2026 / 07:38 PM IST

డ్రైనేజ్ పనులను పరిశీలించిన కౌన్సిలర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 10వ వార్డులో జరుగుతున్న సైడ్ డ్రైనేజ్ పనులను మంగళవారం కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ పరిశీలించారు. ప్రభుత్వ నియమాలు పాటిస్తూ నాణ్యతతో కూడిన పనులు నిర్వహించాలని అధికారులను కోరారు. ప్రజలకు సౌకర్యవంతమైన వసతులు అందించే దిశగా మున్సిపాలిటిలో పనులు చేపట్టాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.

March 17, 2026 / 07:35 PM IST

అజ్మీర గోవింద్ నాయక్ అంత్యక్రియలో పాల్గొన్న బోథ్ MLA

ADB: మాజీ శాసనసభ్యుడు అజ్మీర గోవింద్ నాయక్ అంత్యక్రియల్లో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గోవింద్ నాయక్ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే నిజమైన ప్రజానాయకుడని, ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

March 17, 2026 / 07:35 PM IST

‘అన్ని వీధులను సీసీ రోడ్లుగా మారుస్తాం’

NLG: చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామంలోని వార్డుల్లో మంగళవారం సీసీ రోడ్ల పనులను సర్పంచ్ కట్ట ఆశయ్య, ఉప సర్పంచ్ సామిడి సాయి కృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని అన్ని వీధులను సీసీ రోడ్లుగా మార్చడమే కాకుండా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

March 17, 2026 / 07:32 PM IST

ఓటరు జాబితాపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమీక్ష

GDWL: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడానికి బూత్ లెవల్ ఏజెంట్స్‌ను నియమించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం గద్వాల ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్ నందు SIR పురోగతిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు.

March 17, 2026 / 07:30 PM IST

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

MDK: చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్‌తో కలిసి స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, వివిధ కేసుల్లో ఉన్న వాహనాల వివరాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలని సూచించారు.

March 17, 2026 / 07:30 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా ఎస్పీ

SRD: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ముస్లిం సిబ్బందికి మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర భావం, ఐక్యతకు ఇఫ్తార్ విందు నిదర్శనమన్నారు.

March 17, 2026 / 07:30 PM IST

జిల్లా పీహెచ్‌సీలో పెరిగిన ప్రసవాలు

SRPT: జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని DMHO డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చొరవతో రూ.15 లక్షలతో ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చామన్నారు. ఫలితంగా నెలకు 4 ఉన్న ప్రసవాలు 12కు పెరిగాయని, మాతాశిశు సంరక్షణలో జిల్లా రాష్ట్రంలోనే ముందుందని ఆయన పేర్కొన్నారు.

March 17, 2026 / 07:30 PM IST

దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

MBNR: పట్టణ పరిధిలోని శ్రీనివాస్ కాలనీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని మంగళవారం కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

March 17, 2026 / 07:30 PM IST

అక్రమంగా ఇసుక విక్రయిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

BHPL: రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. SI సుధాకర్ వివరాల ప్రకారం.. కాల్వపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని సిద్దు ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

March 17, 2026 / 07:29 PM IST

ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

KNR: శంకరపట్నం మండలం లింగాపూర్‌‌లో సర్పంచ్ మొరే స్వరూప ఆధ్వర్యంలో సోమవారం ఉచితగాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మొత్తం 330 పాడి పశువులకు టీకాలు వేసినట్లు పశువైద్యులు మాధవరావు తెలిపారు. పశువులలో సంక్రమించే వ్యాధులను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని చేపట్టిందని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 17, 2026 / 07:29 PM IST