NLR: కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించనున్న భూమి పూజకు ముందుగా సభా ప్రాంగణాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలతో కలిసి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు.
ATP: గుత్తి మండలం ఎస్ ఎస్ పల్లి గ్రామంలో మంగళవారం శ్రీ అంకాలమ్మ తల్లి ఊరిదేవర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఊరి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని పూజించమన్నారు.
E.G: కడియం మండలం దుళ్ల రైతు సేవా కేంద్రం వద్ద జరుగుతున్న జాతీయ సేవా పథకం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. రాజమండ్రిలోని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎ.విశాలాక్షి దేవి మాట్లాడుతూ.. మట్టి నమూనాల సేకరణ పైన రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించారు. మితిమీరిన పురుగు మందులు, ఎరువులు వినియోగం వల్ల పంటకు ఉపయోగం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందన్నారు.
ASF: బైక్ అదుపుతప్పి తిర్యాణి మండలం గిన్నెదరికి చెందిన ఉపాధ్యాయుడు మడావి రవి (36) అక్కడికక్కడే మృతి చెందాడు. సుంగాపూర్ పాఠశాలలో CRTగా పనిచేస్తున్న రవి మంగళవారం స్వగ్రామం గిన్నెదారికి బైక్‌పై బయలుదేరారు. తుంపల్లి శివారులోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుకు తలబలంగా ఢీకొట్టడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కృష్ణా: తోట్లవల్లూరు మండలం వల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి ఆఖరి మజిలీ స్మశాన వాటిక నిర్మాణానికి కలెక్టర్ బాలాజీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రతీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోను స్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని సూచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
SRCL: జిల్లాలో 11 సబ్ స్టేషన్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశం అనంతరం ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ మంత్రులు ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు, నాగేశ్వరరావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు.
PDPL: రైతులు పంట మార్పిడి చేసి లాభదాయక పంటలపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామణరావు సూచించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎలిగేడు మండలంలో నిర్వహించిన రైతు వారోత్సవంలో పాల్గొన్నారు ప్రతి రైతు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలని సూచించారు.
CTR: కార్వేటినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పచ్చికాపల్లం అంగన్వాడి కేంద్రంలో అవగాహన సమావేశం నిర్వహించారు. సూపర్వైజర్ శకుంతల నేతృత్వంలో పోషకాహారం, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నిషేధం, సెల్‌ఫోన్ వినియోగం తగ్గింపు వంటి అంశాలపై తల్లిదండ్రులు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌కే హైమావతి, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: కవిటి మండలం చిన్న మెలియాపుట్టుగలో శ్రీ అన్నపూర్ణేశ్వరి సంబరంలో చిన్నారుల నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఇచ్చాపురం చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం, జానపదాలు, ఒడియా, సంబల్పురి, సినీ రీమిక్స్ పాటలతో ఆహుతులను అలరించారు. నాట్య గురువు బలివాడ శృతి పట్నాయక్, డాన్స్ టీచర్స్ కావ్య, జయ, శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించారు.
KNR: శంకరపట్నం మండలం గద్దపాకలో విషాదం నెలకొంది. మంగళవారం సాయంత్రం మబ్బులు కమ్మేయడంతో ధాన్యాన్ని కుప్పలు పోస్తుండగా గ్రామానికి చెందిన కొయ్యడ ఐలయ్య ఒక్కసారిగా కుప్పకూలినట్లు స్థానిక రైతులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
SDPT: ప్రజలు తెలంగాణ రక్షణ సేన(TRS) పార్టీని ఆదరించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దుబ్బాకలోని రామాలయ దర్శనానికి వెళ్తూ మంగళవారం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆమె కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే సిద్దిపేటలో పర్యటించి అన్ని కమిటీలను నియమిస్తామని తెలిపారు. ఇక్కడి ప్రజలు తమకు అండగా ఉంటారనే నమ్మకం ఉందన్నారు.
2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేజ్రీవాల్ పార్టీ.. 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఇప్పుడు TNలో విజయ్ పార్టీకి 10 సీట్లు తక్కువ రాగా.. కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు రెడీగా ఉంది. అప్పుడు సీఎంగా ఉన్న షీలా దీక్షిత్‌ను ఎమ్మెల్యేగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించగా.. ఇప్పుడు స్టాలిన్‌ను టీవీకే ఓడించింది.
NDL: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ముక్తర్ బాషాకు మంగళవారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. రుద్రవరం రేంజ్‌లో 4 ఏళ్ల నుంచి ఆలమూరు సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు.. ఉన్నతాధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించి, కడప డివిజన్ సిద్ధవటం అటవీ క్షేత్రానికి బదిలీ చేశారు.
MLG: ములుగు, మల్లంపల్లి మండలాల్లో త్వరలో జరగనున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నేపథ్యంలో మండల స్థాయి పోటీల్లో పాల్గొనదలచిన జట్లు మే 10లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంగళవారం డీఎస్పీ ఎన్. రవీందర్ తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ లేదా ములుగు పోలీస్ స్టేషన్ (8712670082) నంబర్ కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
MDK: మెదక్ మార్కెట్ ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు మెరుపు దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.37,335 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో వెంకట్, హుస్సేన్, శేఖర్, రంగారాం, రాజు ఉన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.