KRNL: ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారని DIG, జిల్లా ఇంఛార్జ్ SP విక్రాంత్ పాటిల్ ఇవాళ హెచ్చరించారు. పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్, అమ్మవడి వంటి పథకాల పేరుతో ఆకర్షణీయ సందేశాలు పంపి ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. తెలియని లింకులను క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పవద్దన్నారు.
ATP: జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని పేరం స్వర్ణలత, పేరం అమర్‌నాథ్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, అనంత చంద్రారెడ్డిని కూడా వారి నివాసాల్లో కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చించారు.
VSP: సంక్రాంతి పూర్తయిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు(08517/18)నడుపుతున్నట్లు వాల్తేర్ డీసీఎం పవన్ కుమార్ శుక్రవారం తెలిపారు. రైలు జనవరి 18న మధ్యాహ్నం 3:50కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30కు చర్లపల్లి చేరుతుంది. తిరుగి ప్రయాణంలో చర్లపల్లి నుంచి 19న బయలుదేరి 20న అర్ధరాత్రి విశాఖ చేరుతుంది.
అన్నమయ్య: ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని మండల కేంద్రంలోని టీడీపీ యువకులు పోస్టర్లను విడుదల చేసి ప్రజలను భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువ నాయకుడు తోహిద్ ఖాన్ మాట్లాడుతూ, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారిని కాపాడగలమని తెలిపారు.
CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధ మహిళ మృతి చెందింది. గంగవరం మండలం బూడిదపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (70) పండుగకు వినాయకపురంలో ఉన్న చెల్లెలి కూతురు ఇంటికి వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో హైవేపై రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరగడంతో ఘటనాస్థలంలోనే ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో క్రీడాకారులకు విశ్రాంత DSP సుకుమార్ బాబు ఉచితంగా స్పోర్ట్స్ మెటీరియల్‌ను అందజేశారు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం గ్రామంలో నిర్వహించిన వాలీబాల్, షటిల్ వివిధ రకాల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NDL: నందికొట్కూరులో వాల్మీకి నగర్ కుమ్మరిపేటలో సిపిఎం ఆధ్వర్యంలో ముగ్గులు ఆటలు పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
PLD: సంక్రాంతి పర్వదినాన లింగారావుపాలెం, జాలాది గ్రామాల్లో తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న తెప్పలపై శైవ, వైష్ణవ మూర్తులు జలవిహారం చేశారు. వేద మంత్రాలు, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పండుగ వాతావరణంలో సెల్ఫీలు, ఫోటోలతో సందడి చేశారు.
ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక డీవీ పార్కులో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు మనోహర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, కోలాటం, కుర్చీలాట తదితర సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన వారికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
AKP: పాయకరావుపేట(మం) శ్రీరాంపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. బైక్‌పై వెళుతున్న నామవరపు లోకేష్, కార్తీక్ కుమార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వీరిద్దరితోపాటు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తి కూడా గాయపడ్డాడు. వీరిని 108 అంబులెన్స్‌పై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ అప్పన్న తెలిపారు.
NTR: వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ట్రాక్టర్ రివర్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఆశావాహులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను ఆసక్తిగా తిలకించటంతో పండుగ వాతావరణం ఉట్టిపడింది.
W.G: ఆకివీడులో కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీ భీమేశ్వర, మదన గోపాల, జలదుర్గా శక్తిశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. ఆధునిక వాహనాలకు భిన్నంగా.. సంప్రదాయ రీతిలో ఎడ్ల బండ్లపై సాగిన ఈ ఊరేగింపు అలనాటి స్మృతులను గుర్తుచేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
W.G: పాలకోడేరు మండలంలో సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదాలు జోరుగా సాగాయి. మండల వ్యాప్తంగా సుమారు 10 బరులు ఏర్పాటు చేయగా.. పందెం రాయుళ్లు, వీక్షకులతో కిటకిటలాడాయి. కోడిపందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూద క్రీడలతో లక్షల రూపాయలు చేతులు మారాయి. ఏటా మాదిరిగానే ఈసారి కూడా పందేలు చూసేందుకు జనం ఎగబడటంతో మండలంలో సందడి వాతావరణం నెలకొంది.
KDP: 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు సూచనలు చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
VZM: మెరకముడిదాం(మం) బుధరాయవలస ఎస్సై లోకేష్ కుమార్ శుక్రవారం సంక్రాంతి పండుగకి గ్రామాలకు వచ్చి.. తిరిగి ప్రయాణం చేస్తున్న వాహనదారులకు సేఫ్ జర్నీ అంటూ అవగాహనపరిచారు. మండల ప్రధాన కేంద్రాల జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో ప్లకార్డులు హ్యాపీ జర్నీ అంటూ ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.