• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పాఠశాలను దత్తత తీసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

NTR: ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు ఎం.రాం ప్రదీప్ దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే పాఠశాల కోసం రూ.1 లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన, దాతల సహకారంతో అన్ని వసతులు కల్పిస్తానన్నారు.

June 3, 2026 / 07:38 PM IST

పాఠశాల వద్ద శ్రమదాన

AKP: నాతవరం మండలం వెన్నెలపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పూర్వ విద్యార్థులు బుధవారం శ్రమదానం నిర్వహించారు. పాఠశాల పునఃప్రారంభానికి ముందుగా ప్రాంగణాన్ని శుభ్రపరచి, భవనానికి రంగులు వేయించి, గార్డెనింగ్ పనులు చేపట్టారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దీంతో వారిని పలువురు అభినందించారు.

June 3, 2026 / 07:37 PM IST

మంత్రిని కలిసిన ఆలూరు టీడీపీ ఇంఛార్జ్

KRNL: ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని వైకుంఠం జ్యోతి కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

June 3, 2026 / 07:36 PM IST

ఆత్మకూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: ఆత్మకూరు పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఓటర్ల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన వారికి సూచించారు.

June 3, 2026 / 07:35 PM IST

తెనాలి ఆటోనగర్‌లో రెవెన్యూ అధికారుల సర్వే

GNTR: తెనాలి ఆటోనగర్‌లో రెవెన్యూ అధికారులు బుధవారం సాయంత్రం సర్వే నిర్వహించారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఎంపీడీవో అత్తోట దీప్తి నేతృత్వంలో వీఆర్వోలు, సిబ్బంది కలిసి ఐదు బృందాలుగా పరిశ్రమలు, గోడౌన్‌లు తనిఖీ చేశారు. ఇటీవల ఇక్కడ ఓ కెమికల్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరుగగా పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా సర్వే చేపట్టినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు.

June 3, 2026 / 07:34 PM IST

రక్షణ చట్టాలపై పోలీసుల అవగాహన

సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో పోక్సో చట్టం, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాలికలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని, 16 నుంచి 18 ఏళ్ల పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.

June 3, 2026 / 07:32 PM IST

‘మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి’

ఏలూరులో బుధవారం ఐ.ఎఫ్.టి.యు నగర కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. మున్సిపల్ ఆప్కాస్ ఉద్యోగులను పంజాబ్ తరహాలో పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ, తక్షణమే వాటిని తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు.

June 3, 2026 / 07:28 PM IST

విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో బుధవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతను, పురోగతిని పర్యవేక్షించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు & కాంట్రాక్టర్‌కు పలు కీలక సూచనలు చేశారు.

June 3, 2026 / 07:27 PM IST

APMC ఎన్నికల్లో మదనపల్లి వైద్యుడికి కీలక పదవి

అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) ఇంటర్నల్ ఎన్నికల్లో మదనపల్లికి చెందిన డా.ఏవి సుబ్బారెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. 25 మంది సభ్యులలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను ఎన్నుకోగా, అందులో సుబ్బారెడ్డి విజయం సాధించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు వైద్య సంస్థల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు వైద్య వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

June 3, 2026 / 07:25 PM IST

‘ఖాళీ వైద్య పోస్టులు భర్తీ చేయండి’

ATP: అనంతపురం డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీదేవికి డీవైఎఫ్ఐ నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, జిల్లా కార్యదర్శి కసాపురం రమేష్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

June 3, 2026 / 07:23 PM IST

‘రేపు జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి’

PLD: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రేపు నిర్వహించే “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

June 3, 2026 / 07:14 PM IST

‘స్వచ్ఛ పథం అనేది నిరంతర పారిశుధ్య ఉద్యమం’

ASR: స్వచ్ఛ పథం అనేది ప్రతి బుధవారం తప్పనిసరిగా పంచాయతీల్లో నిర్వహించే ఒక నిరంతర పారిశుధ్య ఉద్యమమని కలెక్టర్ నిశాంతి అన్నారు. హుకుంపేట మండలం కొంతిలి ప్రాంతంలో బుధవారం జరిగిన స్వచ్ఛ పథం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పంచాయతీల్లో రోడ్ల పక్కన చెత్త కుప్పలను తొలగించడం, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.

June 3, 2026 / 07:11 PM IST

‘ఏపీ హక్కులపై పవన్ పోరాడాలి’

VSP: తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసులు, హైకోర్టు అనుమతి నిరాకరిస్తే కాంగ్రెస్ పై పవన్ కళ్యాణ్ అసహనం చూపడం సరికాదని విశాఖ తూర్ప కాంగ్రెస్ నేత ప్రియాంక దండి బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. బీజేపీ దర్శకత్వంలో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ సభ అని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై పోరాడాలన్నారు.

June 3, 2026 / 07:11 PM IST

అమలాపురంలో రామ్ చరణ్ అభిమానులు భారీ ర్యాలీ

కోనసీమ: అమలాపురంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులు బుధవారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పుల్లయ్య రామాలయం శ్రీ రామపురం, హైస్కూల్ సెంటర్, గడియార స్తంభం మీదుగా సాగి వీపీసీ థియేటర్ వద్దకు చేరుకుంది. సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.

June 3, 2026 / 07:10 PM IST

ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయం: దద్దాల

ప్రకాశం: కనిగిరిలో బుధవారం నిర్వహించిన వైసీపీ బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణుల శిక్షణా సదస్సులో నియోజకవర్గ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియలో బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.

June 3, 2026 / 07:07 PM IST