W.G: ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకమని ప్రిన్సిపల్ టి.అశోక్ అన్నారు. ఫార్మసీ పితామహుడు మహాదేవ్ లాల్ ప్రాఫ్ జయంతి సందర్భంగా శుక్రవారం తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఫార్మసీ విద్యార్థులు నైతిక విలువలు, సేవ భావంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు.
PLD: మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాచర్ల అర్బన్ సీఐ వెంకటరమణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో విధులు ఏ విధంగా ఉంటాయని, ఎవరు ఎలా విధులు నిర్వహిస్తారని విద్యార్థులకు వివరించారు.
కడప: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి డా.హరి కొండయ్య తెలిపారు. సిద్దవటం ZP ఉన్నత పాఠశాలలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మార్చి 12 వరకు జరుగు నిరసనలో భాగంగా ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్ ధరించి విధులకు హాజరయ్యారు.
SKLM: కొత్తూరు మండలంలోని పాతపాడు-నివగాం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి శంకుస్థాపన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు డాక్టర్ సాయి గణేష్ హాజరై రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. Aరూ.1.50 కోట్ల నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకి సూచించారు.
PPM: ఈనెల 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి తెలిపారు. వారోత్సవాలలో భాగంగా మల్టీ ఫంక్షన్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై, ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు.
ASR: హుకుంపేట మండలం ములియాపుట్టు పంచాయతీలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జోగులపుట్టు గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన 41 కొత్త పాసు పుస్తకాలను ఆర్డీవో లోకేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు.
అన్నమయ్య: మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల, వంశీకృష్ణ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారనే సమాచారంతో సీఐలు శివన్న, శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలిసి గురువారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 5 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు తెలిపారు.
E.G: వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణం చేపట్టాల్సిన కీలక పనుల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను శుక్రవారం ఆదేశించారు. RWS DEE, AEలతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్రద్వారబందం, వెలుగుబంద, ఫరిజల్లిపేట పలు గ్రామాలలో బోర్‌వెల్, ఆర్‌వో ప్లాంట్, అవసరమైన చోట్ల పైపులైన్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం రాజుపాలెం గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కొనుగోలు కేంద్రం రైతుల సంక్షేమానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న కిరాణా దుకాణాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి, గుట్కా, ఖైనీ వంటి నిషేధిత ఉత్పత్తులను విక్రయించడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీటిని నిషేధించిందని గుర్తుచేశారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈనాం సిబ్బంది, సూపర్‌వైజర్లు, గ్రేడ్–1, గ్రేడ్–2 అధికారులు, యూడీసీ, ఎల్డీసీలు, గార్డులు నుంచి ఆమె వివరాలు సేకరించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సాధకబాధకాలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
AKP: కోటవురట్ల పంచాయతీ పరిధిలో లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ పరమేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక బీసీ కాలనీలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కొత్త డీటీఆర్ ఎరెక్షన్ అమర్చారు. విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు లైన్‌మెన్ నూకరాజు తెలిపారు.
TPT: సత్యవేడు మండలం కొత్తమారికుప్పం పంచాయతీ ఇంద్రపురం కాలనీలో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణానికి జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నఈటిపాకం, రాచపాలెం, ఇంద్రపురం ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కాలమనాయుడుపేటలో కల్వర్టు నిర్మాణం సహా మొత్తం రూ.18 లక్షల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
VZM: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ బ్యారెక్స్‌లో ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి సీఎం పాల్గొన్న కార్యక్రమం జిల్లా స్థాయిలో లైవ్ టెలికాస్ట్ కావాలని సూచించారు. అలాగే, అధికారులకు పలు సూచనలు చేశారు.
W.G: భీమవరంలో పర్యటించిన మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలను, లడ్డూ ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. శాసనమండలి ఛైర్మన్ కులం, జాతి గురించి ప్రస్తావించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆరోపించారు. దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.