ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీటలు బారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో పార్టీని భారీ కుదుపులు ఆందోళన కలిగిస్తుండగా మరో చోట పార్టీ కార్యకర్తలే కోపమొచ్చింది.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆలయంలోకి అడుగు పెట్టకూడదని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటన కాకినాడ జిల్లాలో జరిగింది.
చదవండి:
అనపర్తి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఉత్సవాలకు ఆయన అనుమతి తీసుకురావడంలో విఫలమయ్యారు. ఉత్సవాల్లో భాగంగా పలు క్రీడాపోటీలకు పోలీసుల అనుమతి తీసుకురావడంలో విఫలమయ్యారంటూ సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయంలోకి అనుమతించమంటూ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే కారుకు అడ్డంగా నిలబడి.. రోడ్డుపై బైఠాయించి ‘ఎమ్మెల్యే గో బ్యాక్.. ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సూర్యనారాయణ స్వామి ఉత్సవంలో భాగంగా గుండాట, ఇతర ఆటలకు పోలీసుల నుంచి అనుమతి తీసుకురాలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. సమాచారం అందుకున్న పెదపూడి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
పోలీసుల అనుమతులే తీసుకురాని ఎమ్మెల్యే ఇక నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పట్టిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతియేటా ఉత్సవాల్లో భాగంగా క్రీడాపోటీలు ఘనంగా జరుగుతాయి. అలాంటి వాటికి అనుమతి తీసుకురాని ఎమ్మెల్యే ఉండి కూడా ఏం ప్రయోజనం అంటూ అనపర్తి నియోజకవర్గ యువకులు నిలదీస్తున్నారు. ఘనంగా జరుగాల్సిన ఉత్సవాలు ఎమ్మెల్యే తీరుతో నామమాత్రంగా జరిగాయని భక్తులు వాపోయారు.