తమపై లైంగిక దాడులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India -WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు (Wrestlers) ఉద్యమం చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కొన్ని వారాలుగా రోడ్డుపై బైఠాయించారు. కాగా వారి ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు రెజ్లర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వర్షంలోనూ (Rain) మన క్రీడాకారులు ఆందోళన చేశారు. అయితే వర్షానికి బెడ్లు తడవడంతో కొత్తవి తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బెడ్లు (Beds) రాకుండా నిలువరించారు. ఈ సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుతో రెజ్లర్లు నిద్రపోకుండా (Sleep) వర్షంలో బిక్కుబిక్కుమంటూ రోడ్లపై నిలిచారు.
పతకాలు (Medals) సాధించిన తమకు ఇలాంటి బతుకు.. జీవితం వస్తుందని ఎప్పుడు అనుకోలేదని భారత రెజ్లర్లు వినేశ్ ఫొగట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia) కన్నీటి పర్యంతమయ్యారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిరసనలు తెలుపుతుంటే పోలీసులు (Police) తమతో దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు తమను దూషించారని వినేశ్ ఫొగట్ కన్నీటి పర్యంతమైంది. ‘మేం ఏమైనా నేరస్తులమా’ అని గద్గద స్వరంతో నిలదీసింది. పోలీసు అధికారి మద్యం మత్తులో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. కాగా రెజ్లర్ల అవస్థలు చూసి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి (Somnath Bharti) బెడ్లు తీసుకురాగా పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదం ఏర్పడడంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. కాగా ఈ వాగ్వాదంలో కొందరు క్రీడాకారులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రెజ్లర్ల రక్తం కళ్లజూశారు. ఇక వీరి ఆందోళనకు మద్దతు తెలపడానికి వస్తున్న నాయకులు, నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని దేశ రాజధానిలో (New Delhi) భారత దిగ్గజ రెజ్లర్లు సాగిస్తున్న ఆందోళన (Protest)కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద వీరి దీక్ష శిబిరానికి సినీ, క్రీడా ప్రముఖులు వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. రోజురోజుకు వీరి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల మద్దతు దక్కుతోంది. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదైంది.