సినీ పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. అనారోగ్యం కారణంగా ఓ ప్రముఖ హీరో కన్నుమూయడంతో ఒడిశా సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒడియా నటుడు పింటు నందా (45) బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. అతడు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడని అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి మృతితో ఒడియా సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు ఒడిశా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నందాకు కాలేయ మార్పిడి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో న్యూఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)లో చేరారు. అయితే అక్కడ అవయవదాత అందుబాటులో లేకపోవడంతో ఆయనను ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించాల్సిన సమయంలో అతడి పరిస్థితి విషమించింది. దీంతో చికిత్స పొందుతూనే బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు.
1977 జూలై 7వ తేదీన జన్మించిన నందా మొదట బుల్లితెరపై మెరిశాడు. అనంతరం 17 ఏళ్ల వయసప్పుడు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 1996లో కోయిలి సినిమాతో నందా హీరోగా అరంగేట్రం చేశాడు. అనంతరం వరుస సినిమాలు చేస్తూ ఒడియా సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగారు. హీరోగా, విలన్ గా, హాస్య నటుడిగా వివిధ పాత్రల్లో నటించి ఒడియా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాడు. దోస్తీ, హత ధారి చాలు తా, రుంకు ఝుమానా, రాంగ్ నంబర్, ప్రేమ రుతు అసిగల తదితర సినిమాలు నందాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించాడు.
నందా మృతిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోెరారు. అతడి సీరియల్స్, సినిమాలు ఒడిశా పరిశ్రమలో చెరిగిపోనివని కొనియాడారు. ఇక చత్తీస్ గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సంతాపం ప్రకటించారు. వారితోపాటు ఒడిశా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. కాగా నందాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం కల్పించాలని ప్రముఖులు తెలిపారు.