Shiv Sena symbol: పార్టీ గుర్తు కోసం రూ. 2000 కోట్లు
శివసేన (shiv Sena) పార్టీలోని ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కు (Uddhav Thackeray) చెందిన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut)ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ గుర్తు కోసం 2000 కోట్లు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
శివసేన (shiv Sena) పార్టీలోని ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కు (Uddhav Thackeray) చెందిన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut)ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ గుర్తు కోసం 2000 కోట్లు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీకి చెందిన బిల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే ( Eknath Shinde) సారథ్యంలోని గ్రూప్ కు కేటాయించింది ఎన్నికల కమిషన్. అయితే గుర్తును షిండే వర్గానికి కేటాయిస్తూ ఈసీ నిర్ణయం వెలువడిన రెండు రోజుల సమయంలోనే సంజయ్ ఈ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలను షిండే వర్గంతో పాటు భారతీయ జనతా పార్టీ (BJP) కొట్టి పారేసింది. మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ పార్టీ సభ్యులు షిండే వైపు ఉన్నారని, అలాగే పార్టీ వారసత్వంగా రాదని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తోంది షిండే వర్గం. శివసేన పార్టీ పేరును, ఎన్నికల గుర్తు విల్లు-బాణంను కొనేందుకు కోట్లల్లో ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, వంద శాతం నిజమని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ సమాచారాన్ని అధికార పార్టీకి సన్నిహితుడైన ఓ బిల్డర్ తనకు చెప్పారన్నారు. తన వాదనకు సాక్ష్యం ఉందని, దానిని త్వరలో బయటపెడతానని ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఈసీ నిర్ణయం ఒక డీల్’ అని ఆరోపిస్తూ మరిన్ని విషయాలు త్వరలో బయటకి వస్తాయన్నారు. రెండు వేల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపణలతో ట్వీట్ చేసిన ఆయన దీనిని ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికల కమిషన్ కు టాగ్ చేశారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రాథమికంగా మాత్రమే అని, ఢిల్లీ నుండి గల్లీ వరకు దీనిపై చర్చ సాగుతోంది అన్నారు.
ఈ వ్యాఖ్యలపై షిండే వర్గం తీవ్రంగా స్పందించింది. ఆదివారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే పుణెలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ… తమకు ఆ శివాజీ ఆశీస్సులతో పార్టీ గుర్తు దక్కిందని చెప్పారు.
షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సదా సర్వాంకర్తో పాటు మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత సుధీర్ మున్గంటీవార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిష్ షెలార్ తదితరులు కూడా తీవ్రంగా ఖండించారు. డీల్ జరిగిందని చెప్పడానికి రౌత్ ఏమైనా క్యాషియరా అని సర్వాంకర్ ప్రశ్నించారు. రౌత్ ఆరోపణలు సుప్రీం కోర్టు, ఈసీ వంటి స్వతంత్ర సంస్థలను అపఖ్యాతి పాల్జేసే ప్రయత్నమని సుధీర్ మండిపడ్డారు. మతిభ్రమించిన వ్యక్తులే ఇలాంటి ఆరోపణలు చేస్తారని షెలార్ విమర్శించారు.