Revanth Reddy Announced Congress youth Declaration
Congress youth Declaration: 5 అంశాలతో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. హైదరాబాద్ సరూర్నగర్లో యువ సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రియాంక గాంధీని నయా ఇందిరమ్మ అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొనియాడారు. తెలంగాణ ఆడబిడ్డ అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని స్పష్టంచేశరాు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన వారిని అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. తల్లి లేదా తండ్రి లేదా భార్యకు ప్రతినెల రూ. 25,000 అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేస్తామని రేవంత్ ప్రకటించారు. ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. జూన్ 2వ తేదీన వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేస్తామని తెలిపారురు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపారు. ప్రత్యేక చట్టంతో టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరిస్తామని వివరించారు.
కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి, 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను నెలకొల్పుతామని ప్రకటించారు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేసి, రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం కల్పిస్తామని వివరించారు.
ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతోపాటు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు, పాత బకాయిలు చెల్లిస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన వర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం, మరియు మెదక్ లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు చేస్తామన్నారు.
బాసరలోని రాజీవ్ గాంధీ IIIT తరహాలో 4 నూతన IIIT లను ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. అమెరికాలో గల IMG అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి, 6వ తరగతి నుండి పట్టభద్రులయ్యేవరకు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేస్తామని హామీనిచ్చారు.