తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయానికి పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు.సచివాలయానికి అంబేడ్కర్ నామకరణం…తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.
‘‘ తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు, మహామేధావి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది’ అని అన్నారు
పార్లమెంట్ కొత్త భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీని పై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధాని మోడీకి లేఖ రాస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
‘భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదు. భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాం. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది కూడా. ఇదే విషయమై నేను భారత ప్రధానికి త్వరలో స్వయంగా లెటర్ కూడా రాసి పంపుతాను. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంట్ భవనానికి డా. బిఆర్. అంబేద్కర్ పేరును పెట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాను’ అని వెల్లడించారు.