‘అవును సినిమాలంటేనే వ్యాపారం.. ప్రజలకు నీతి వాక్యాలు చెప్పేందుకు తీయం’ అని సినీ నిర్మాత, నటుడు కొణిదెల నాగబాబు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. సినిమాల వలన ప్రజలు బాగు పడతారని.. చెడిపోతారని తాను భావించట్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ లో రెండు పోస్టులు చేశారు. ఎవరినో ఉద్దేశించి పరోక్షంగా.. ఘాటుగా నాగబాబు స్పందించారు. కుహన మేధావులు అని ఆ వ్యక్తిని విమర్శించారు.
‘సినిమాల్లో చూపించే హింస (వైలెన్స్) వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే.. మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. ఒక సినీ నిర్మాతగా ఒకటి నిజం. సినిమాలు వినోదం కోసమే. జనాన్ని బాగు చేయడం కోసమో.. చెడగొట్టడం కోసమో తీసేంత గొప్పవాళ్లు లేరు ఇక్కడ. ఇది కేవలం ఒక వ్యాపారం. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది జవాబు. సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే సెన్సార్ బోర్డు ఉంది. కుహనా మేధావులు ఏడవకండి’ అని ట్వీట్ చేశారు. ఉన్న ఫళంగా నాగబాబు ఎందుకు ట్వీట్ చేశారని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. ఇటీవల కొందరు సినిమాలు చూస్తూ చెడిపోతున్నారు అని కొందరు మాట్లాడారు. వారికి కౌంటర్ గా నాగబాబు స్పందించారని తెలుస్తోంది. నాగబాబు వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నాగబాబు చెప్పింది కరెక్టేనని కొందరు కామెంట్ చేస్తుండగా.. ‘వ్యాపారం కోసమే సినిమాలు తీస్తారు.. కానీ ప్రజల బాగు కోసం తీయరు’ అని మరికొందరు కౌంటర్ గా కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం నాగబాబు సినిమాల కన్నా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. తమ్ముడు ప్రారంభించిన జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఏపీ రాజకీయాలపై పూర్తి దృష్టి సారించడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. చిరంజీవి సోదరుడిగా నాగబాబు సినీ పరిశ్రమలోకి ప్రవేశించగా నటుడు, నిర్మాతగా రాణించాడు. ప్రస్తుతం తమ్ముడు పవన్ కల్యాణ్ ను రాజకీయంగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి ఒక చోట పోటీ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు.
సినిమాల్లో చూపించే voilence వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే ,మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా .as a film maker గా ఒకటి నిజం ,సినిమాలు entertainment కోసమే ,జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తేసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ .its జస్ట్ ఆ business .