GNTR: పట్టాభిపురంకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి షేక్ ఖాజా హత్య కేసులో అతని భార్య హజారా (బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు)ను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల గొడవ కారణంగా జూన్ 19న రాత్రి, ఖాజా మద్యం మత్తులో ఉన్నప్పుడు హజారా అతడిని దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపింది. విచారణలో నేరం అంగీకరించడంతో మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు.
AP: విజయనగరం గుర్లలోని కస్తురిబా పాఠశాలలో విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలింది. భారీ ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడటంతో గోడను పట్టుకున్న సుమారు 30 మందికి షాక్ కొట్టింది. దీంతో అధికారులు వారిని విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని జేపీఎం రోడ్లో ఉన్న సాయి ప్లైవుడ్ స్టోర్లో రూ.12 లక్షల నగదు మంగళవారం చోరీకి గురైంది. దుకాణం లాకర్లో ఉన్న నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఇంత జార్ గంజ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
TPT: తిరుమలలోనూ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. కొండపై బాలాజీ నగర్లోని ఓ ఇంటి వద్ద ఉన్న పెద్ద చెట్టు అకస్మాత్తుగా కూలిపోయింది. అక్కడే ఉన్న కారుపై చెట్టు పడటంతో కారు పూర్తిగా దెబ్బతింది. అదే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్టును తొలగించారు.
CTR: వీకోట మండలం మద్దిమకుల పల్లెలో యువకుడిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శరత్(25) పొలాలకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఆవులను మేపడానికి వెళ్లగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో అతడు తీవ్ర గాయాల పాలైయ్యాడు. ఈ మేరకు యువకుడిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
WGL: ఖిల్లా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు ఎదుట జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న లారీ క్రింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకు అదుపు తప్పి పడిపోవడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: మందస(M) బాలిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ముందు వెళ్తున్న లారీను అధికమించే క్రమంలో వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీ మెటల్ క్రాస్ బేరర్ను ఢీకొని సర్వీస్ రోడ్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తణుకు నుంచి కోడిగుడ్ల లోడుతో పశ్చిమ బెంగాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
NZB: మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష పడిందని, 10 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ముందు హాజరుపరచి రూ.13,000 విధించామన్నారు.
కోనసీమ: మామిడికుదురు మండలం మాకనపాలెంలో తాటిచెట్టు విరిగిపడి గూడపల్లి వీరవేణి అనే మహిళ మృతి చెందింది. మంగళవారం ఉదయం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి పక్కనే ఉన్న తాటి చెట్టు విరిగి విరవేణిపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజస్థాన్లోని జైపూర్-ఢిల్లీ రహదారిపై ఓ బస్సు దగ్ధమై ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రన్నింగ్లో ఉండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల జైసల్మేర్లో 26 మంది, రెండ్రోజుల క్రితం కర్నూలులో 19 మంది బస్సు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.
KMR: లింగంపేట్ మండలం పరమల్ల గ్రామానికి చెందిన రమావత్ లింబ, రమావత్ రమేష్, రమావత్ పరమేశులు నాగిరెడ్డిపేట మండలానికి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా కానిస్టేబుళ్లు సందీప్, గంగారం వారిని సోమవారం రాత్రి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. భూకంప కేంద్రం హిమాలయాల సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు టర్కీలోని పలు ప్రాంతాల్లో 6.1 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి.
KMR: కర్రలతో దాడి చేసిన కేసులో ముగ్గురు నిందితులకు నేరం రుజువు కావడంతో 6 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ సోమవారం తీర్పు ఇచ్చారు. బిచ్కుంద (M) చిన్నదడ్దిలో కుశాల్ రెడ్డి, విఠల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి కలిసి యోగేష్ రెడ్డిపై కర్రలతో దాడి చేశారు.
పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సులో భూమి కంపించింది. ప్రకంపనల కారణంగా మూడు భవనాలు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.