»Bjp Suspended Who Attends Ktr Milk Bath Programme In Sircilla
Siricilla కేటీఆర్ ఫొటోకు దండం పెట్టినందుకు పార్టీ నుంచి సస్పెండ్
మంచి ఎవరూ చేసినా ప్రశంసించాలని, దానికి రాజకీయ రంగు పులమడం భావ్యం కాదని తెలిపాడు. రైతుల శ్రేయసు కోరే ఏ కార్యక్రమంలోనైనా తాను రాజకీయాలకు అతీతంగా పాల్గొంటానని ప్రకటించాడు. కాగా పార్టీ సస్పెండ్ తో రాము బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. త్వరలోనే మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన సమక్షంలో గులాబీ కండువా వేసుకోనున్నాడని సమాచారం.
బీజేపీలో వింత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ వర్గాలుగా (Group Politics) పార్టీ చీలిపోయింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, వివేకా ఇలా వర్గాలుగా పార్టీలో గ్రూపులు పెరిగాయి. ఆయా వర్గాలు పార్టీలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయి. ఈ గ్రూపు రాజకీయాలతో పార్టీ అధిష్టానం ఇస్తున్న ఆదేశాలు పటిష్టంగా అమలు కావడం లేదు. కాగా ఈ గ్రూపులతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే ద్వితీయ శ్రేణి (Second Level) నాయకత్వం ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నది. పరిస్థితి ఇలా ఉంటే సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla District) లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఉన్న నాయకులను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో పార్టీని నమ్ముకుని ఉన్న ఓ నాయకుడిని అర్ధాంతరంగా సస్పెండ్ చేసింది. మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశాడని అతడిని కమలం పార్టీ వేటు వేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ ను బీజేపీకి చెందిన చిన్నలింగాపూర్ (Chinnalingapur) ఎంపీటీసీ సభ్యుడు బైరినేని రాము (Bhairineni Ramu)తో పాటు తంగళ్లపల్లి మండలంలోని చిన్నలింగాపూర్, బాలమల్లుపల్లె, నర్సింహుపల్లె గ్రామాల ప్రజలు కలిశారు. తమ గ్రామాల చెరువులకు రంగనాయక సాగర్ కాలువ (Ranganayakasagar Canal) ద్వారా కాళేశ్వర (Kaleshwaram Water) జలాలు తరలించాలని కోరారు. వారి వినతిని పరిశీలించిన కేటీఆర్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే పనులు మొదలయ్యాయి.
కేటీఆర్ చొరవతో ఆయా గ్రామాల చెరువులకు నీళ్లు చేరాయి. ప్రస్తుతం చెరువులు జలకళ సంతరించుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు రాము కూడా పాల్గొన్నాడు. కాళేశ్వర జలాలకు పూజలు చేశారు. రాము ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై స్థానిక బీజేపీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమలం పార్టీ కనీసం వివరణ కూడా అడగకుండానే రామును సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ రామును ఆగమేఘాల మీద బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశాడు.ఈ చర్యపై రాము ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను సస్పెండ్ చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నాడు. 500 మంది రైతుల పొలాలకు నీళ్లిచ్చిన మంత్రి కేటీఆర్ ను గౌరవించడం కనీస ధర్మమని రాము తెలిపాడు. మంచి ఎవరూ చేసినా ప్రశంసించాలని, దానికి రాజకీయ రంగు పులమడం భావ్యం కాదని తెలిపాడు. రైతుల శ్రేయసు కోరే ఏ కార్యక్రమంలోనైనా తాను రాజకీయాలకు అతీతంగా పాల్గొంటానని ప్రకటించాడు. కాగా పార్టీ సస్పెండ్ తో రాము బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. త్వరలోనే మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన సమక్షంలో గులాబీ కండువా వేసుకోనున్నాడని సమాచారం.