బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ సారథ్యంలో తమ పార్టీ టైటానిక్‌లా మునగనుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారంటే?
Subramania Swamy : సొంత పార్టీపై సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి(Subramanya Swamy) మండి పడ్డారు. ఉప ఎన్నికల ఫలితాల్లో 13 స్థానాలకు గాను బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఫలితాల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ టైటానిక్ పడవలా మునిగిపోవాలనుకుంటే మోదీ(Modi) దానికి సరైన సారధి అంటూ నిప్పులు చెరిగారు.
ఇప్పటికే బీజేపీ(Bjp) బీటలు వారి, మునగడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఉప ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ వర్గం సుబ్రహ్మణ్య స్వామిని సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘మీరు చెబుతున్నది నిజమే. ఎందుకంటే మీ కెప్టెన్(Prime Minister Narendra Modi) దేశ ప్రజల కోసం పని చేయడం లేదు. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచి పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారు’ అంటూ కామెంట్లు రాస్తున్నారు.
మరొక వర్గం మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ‘మీరు ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల మీ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నారు. మీరు రిటైర్ అయిపోవడం మంచిది’ అంటూ కొందరు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఫలితాల్లో 10 సీట్లను ఇండియా కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. రెండు సీట్లను మాత్రమే బీజేపీ దక్కించుకుంది. దీంతో బీజేపీపై వ్యతిరేకత ప్రజల్లో మొదలైందంటూ ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
If we in BJP want to see our party sink like the Titantic Ship then Modi is the best to command.By-Election results show BJP is cracking up to sink forever.