Kishan Reddy: The Congress government made promises it could not implement
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదన్నారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. అలాగే కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి బస్సులు తగ్గించారు. తెలంగాణ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత మేం తీసుకున్నాం. హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తాం.
కర్ణాటకలో కూడా హామీలు అమలు చేయట్లేదు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పన్నులు ఉపయోగిస్తున్నారు. హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు? మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్ షాపులు మూయించాలన్నారు. రాష్ట్రం ఏర్పాటై పదేళ్లయిన ఇంకా కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు. దీంతో మహిళలు గ్యాస్ కనెక్షన్లు తీసుకోలేకపోతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.