వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Telangana: వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఆగ్నేయం వైపు వంగి ఉంది.
రుతుపవన ద్రోణి ఇవాళ జైసల్మేర్, అజ్మీర్, గుణ, తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై అల్పపీడనం మీదుగా వెళ్తూ.. తూర్పు- మధ్య బంగాళాఖాతం వరకు సగటున సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటివేళ ముసురు వాన కురుస్తుండగా.. రాత్రిళ్లు వాన దంచికొడుతోంది. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లాలు తడిసిముద్దయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.