‘అమృత్ కాల్ బడ్జెట్’ పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వే శాఖ బడ్జెట్ కూడా ఉంది. రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ గతంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లోనే కలిపేసిన విషయం తెలిసిందే.
‘ఈ బడ్జెట్ లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తున్నాం. రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్ లో రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపులు చేస్తున్నాం. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం. మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నాం. మూలధనం కింద రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం’ అని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ సప్తరుషి అనే పేరుతో ఏడు ప్రాథమ్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు.