దేశమంతా గణతంత్ర వేడుకల్లో మునిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని మాచర్లలో మాత్రం రౌడీల్లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసే విషయంలో మొదలైన వివాదం పరస్పరం వీధి రౌడీల్లా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ పాఠశాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. బాహాబాహీకి దిగడంతో విద్యార్థులు భయాందోళనలతో ఇళ్లకు పరుగులు పెట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి వర్గీయులుగా పార్టీ రెండుగా చీలింది. ఈనెల 26న వెల్దుర్తిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జెండా వందనం అనంతరం విద్యార్థులకు బహుమతులు పంపిణీ కార్యక్రమం మొదలైంది. అయితే పంపిణీ విషయంలో గ్రామానికి చెందిన ఈ రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది. వివాదం ముదిరి బాహాబాహికి దిగారు. ఘర్షణకి దారితీసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విద్యార్థుల ముందే వీధీ రౌడీల్లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన విద్యార్థులు భయాందోళనతో పారిపోయారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు.