ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ని పటిష్టం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కాగా… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పై తాజాగా విజయశాంతి స్పందించారు.
ఏపీలో జనసేనను, ఆపార్టీతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలే సంకేతాలు ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే ఏపీలోనూ అక్కడి ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు.
ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన అత్యంత బలమైన ఒక సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేయటానికి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దుష్ప్రయత్నం చేస్తున్నారన్నారు విజయశాంతి. దీన్ని ఏపీతోపాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కు నెట్టి వేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు అర్థం చేసుకుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
కేసీఆర్ ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అలాంటి కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ కు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.