చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా టీడీపీ జెండా పీకేయడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం అన్నారు. పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పని అయిపోయిందని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ప్రజలు తనకు బుద్ధి చెప్పడం కాదని, చంద్రబాబు పనే అయిపోయిందని వ్యాఖ్యానించారు.
నా అంతు నువ్వు చూడటం కాదు, ప్రజలే నీ అంతు చూస్తారని భగ్గుమన్నారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను చంద్రబాబుపై కుప్పంలో పోటీకి సిద్ధమని, మరి చంద్రబాబు పుంగనూరు నుండి సిద్ధమా అని సవాల్ చేశారు. కుప్పంలో వచ్చేసారి ఆయనకు డిపాజిట్ కూడా వస్తుందా అనుమానమే అన్నారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు కారుకూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. తన కోసం, తన ఎల్లో మీడియా కోసం మాత్రమే బాబు పని చేస్తున్నారన్నారు.
బాబు రాజకీయ భవిష్యత్తును ప్రజలు ఎప్పుడో చించివేశారని, చిత్తూరులో బాబు తిరిగి పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. జగన్ ప్రజల కోసం పని చేస్తున్నారని, కానీ ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ జెండా పీకేయడం ఖాయమన్నారు. గతంలో ప్రజాకంటక పాలన అందించిన చంద్రబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు.