SKLM: పొందూరు మండలం ధర్మపురంకి చెందిన ఎం రాజ్ కుమార్ జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష గేట్ (GATE)లో ఆల్ ఇండియా ర్యాంక్ 248 సాధించి ప్రతిభ చాటారు. ఫిబ్రవరి 8న ఆల్ ఇండియా గేట్ పరీక్షల్లో పాల్గొని రాశారు. ఈ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రాజ్ కుమార్ ప్రస్తుతం ఐఐటి ధన్‌బాద్‌లో AI ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌లో పరిశోధనలు చేస్తున్నారు.
KDP: షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీ అన్న నీకు చేసిన ద్రోహం ఏంటో సమాధానం చెప్పాలని రాచమల్లు ప్రొద్దుటూరులోని తన నివాసంలో మీడియా ఎదుట మండిపడ్డారు. మీ ఇంట్లో జరిగే కుటుంబ సమస్యలను పులివెందుల పూల అంగళ్ల దెగ్గర బజారుకు ఈడ్చారని రాచమల్లు సీరియస్ అయ్యారు.
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్లో వచ్చే విద్యా సంవత్సరానికి నూతన ప్రవేశాల నమోదు కార్యక్రమాన్ని పాఠశాల కమిటీ ఛైర్మన్ ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాల పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలతో పాటు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్రస్థాయి క్రీడలలో, జాతీయ స్థాయిలో రాణించారని పేర్కొన్నారు.
కృష్ణా: నందివాడ గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ సుబ్రహ్మణ్యం పోలీస్ సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై గురువారం దాడి చేశారు. ఈ దాడిలో కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7820 నగదు,15 బైకులు, 9 సెల్ ఫోన్లు, ఒక కోడిపుంజు, రెండు కత్తులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
PPM: జిల్లాలో గ్యాస్ కొరత లేదని నిబంధనల మేరకు గ్యాస్ సరఫరా జరుగుతోందని జిల్లా సరఫరాల శాఖ అధికారి అశోక్ గురువారం తెలిపారు. ఈనెల ఓ పత్రికలో ప్రచురితమైన ‘గ్యాస్ మంట, చిరు వ్యాపారులకు తంటా’ అనే కథనానికి ఆయన స్పందించారు. గ్యాస్ సరఫరా నిరంతర పర్యవేక్షణకు అధికారులను నియమించామని స్పష్టం చేశారు. గ్యాస్‌ను అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అన్నమయ్య: పెనగలూరు మండలం ఇండ్లూరు సమీపంలోని వైన్ షాప్ వద్ద జరిగిన గొడవలో నర్సింహులు (38) అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి, పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 11న వైన్ షాప్ వద్ద నర్సింహులుపై కంబాలకుంటకు చెందిన గుండ్లూరు వెంకటేశ్, గణేశ్ తీవ్రంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన నర్సింహులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 17న మరణించారు.
ATP: జిల్లాలో కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నార్పల మండలంలో సుమారు 125 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు ఏవో చిన్న వీరస్వామి తెలిపారు. గంగనపల్లి, బొందలవాడ ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరగడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారి నెట్టికంటయ్య పేర్కొన్నారు.
BPT: బుద్దాం గ్రామంలో గురువారం అకాల వర్షం ఓ రైతును నిండా ముంచింది. ఆకస్మికంగా పడిన పిడుగుకు ఓ వరి కుప్ప పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన నర్రా నాగరాజు ఎకరం 20 సెంట్ల పొలంలో పండించిన ధాన్యాన్ని కుప్పగా వేశాడు. పిడుగు పడటంతో ఆరుగాలం పడిన కష్టం కళ్లెదుటే కాలి బూడిదైంది. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో ఆ రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.
AKP: పాయకరావుపేటలో ప్రతీ ఏటా ఉగాది రోజున జరిగే చిలకల తీర్థానికి వర్షం ఆటంకం కలిగించింది. స్థానిక మంగవరం రోడ్డులో పేరంటాల అమ్మవారి తీర్థం జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు పంచదార చిలకలు కొని తీసుకువెళ్లడం ఆచారంగా వస్తుంది. సాయంత్రం తీర్థం ప్రారంభమైన తరువాత చిరు జల్లులు కురవడంతో వ్యాపారులు ఇబ్బంది పడ్డారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణం ఖాజా నగర్‌లోని మైనార్టీ సోదరుడు ఖాదర్ భాషా ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 50 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి చీరలను అందజేశారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో పేదవారికి చీరలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు.
E.G: రంగంపేటకు చెందిన సైకత శిల్పులు దేవిన ధన్యత, సోహిత సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఉగాది పురస్కారం’ అందించింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిని సత్కరించారు. ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు, శిల్పకళ ద్వారా సమాజ చైతన్యానికి చేస్తున్న కృషిని అభినందించారు
విజయనగరంలోని ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పైడిమాంబ ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని, కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బొత్స ఆకాంక్షించారు.
KRNL: పెద్దకడబూరులో ఉగాది పండుగ సంధర్బంగా నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజల అనంతరం విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి రథాన్ని కదిలించారు. స్థానిక చావిడి దగ్గర నుంచి బస్ స్టాండ్ సమీపం వరకు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ASR: ప్రజల సమస్యల పరిష్కారానికి ఈనెల 20న అరకులోయలో ప్రజా వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్, అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొర పాల్గొననున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
NDL: పాములపాడు మండలంలోని ఇస్కాల గ్రామానికి చెందిన లీలావతి (30) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 18న గడ్డిమందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆత్మకూరులో ప్రథమ చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు.