SKLM: జైళ్లలో కుల వివక్షకు తావుండ కూడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం అంపోలులోని జిల్లా జైలును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డితో పాటు ‘బోర్డ్ ఆఫ్ విజిటర్స్’ బృందంతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో అందరికీ సమాన సౌకర్యాలు అందాలని అధికారులను ఆదేశించారు
PLD: సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని బుధవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు.
PPM: విక్రంపురంలో ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య తనిఖీ రికార్డులు, వైద్య పరీక్ష పరికరాల పనితీరు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యం మెరుగుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
BPT: అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఓటరు నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (KORGRP R&R యూనిట్, ఒంగోలు) విజయ జ్యోతి కుమారి అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ ప్రక్రియపై వివరించారు.
KRNL: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం తెలిపారు. రూ.1.36 లక్షల కోట్లతో ఏర్పడనున్న భారీ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.
NDL: నంద్యాల మండలం కానాల గ్రామపంచాయతీ పరిధిలోని హై స్కూల్ కొట్టాల గ్రామంలో ఇవాళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
VSP: సింహాచలం దేవస్థానంలో చందనోత్సవంలో గోడ కూలిన పలువురు మరణించిన ఘటనలో సస్పెండ్ అయిన దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుపై ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణ అనంతరం విధించిన క్రమశిక్షణా చర్యలను ఇప్పుడు రద్దు చేయడంతో, ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు.
GNTR: మంత్రి నారా లోకేష్‌ను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి విద్యాసాగర్ ఇతర జేఏసీ నేతలు సంయుక్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ELR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శనానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఏలూరు డిపో నుంచి 20 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 14 బస్సులు, నూజివీడు నుంచి 6 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బుధవారం కలిశారు. పెన్నా నది కరకట్టల బలోపేతం, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2011లో వచ్చిన వరదలు దాటికి ప్రజలు పడ్డ ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
SKLM: జిల్లాలో 3వ త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో GDP లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. జిల్లా అభివృద్ధి వేగవంతం కావాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం పథకాలకు బ్యాంకులు సమయానికి రుణాలు మంజూరు చేయాలన్నారు.
ASR: బాలికల రక్తహీనతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని జిల్లా వైద్య నిపుణులు గ్రేష్టు, కిషోర్‌కుమార్ తెలిపారు. డుంబ్రిగూడ కేజీబీవీలో బుధవారం 40 మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర బాల్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. పాఠశాలలతో పాటు గ్రామాల్లో 15 ఏళ్ల బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామన్నారు.
ప్రకాశం: పామూరు మండలం దోబగుంట్ల వద్ద వెలిగొండ ప్రాజెక్టు కాలువల పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు సయ్యద్ అనీఫ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోపాడు రిజర్వాయర్‌ను వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చి రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని కోరారు. దీంతో మండలంలోని రైతులకు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
VZM: మెరకముడిదాం మండల వైసీపీ నాయకులతో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ క్యాడర్ స్థానిక ఎన్నికలు గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారు. అలాగే, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.