తనకు తన తండ్రి హెచ్డీ దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎంతో స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో దేవేగౌడ, తర్వాత కేసీఆర్ అద్భుతమన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ తనకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రభుత్వ మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్ మిషన్‌కు ఏమాత్రం తీసిపోదన్నారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే తెలంగాణ తరహా సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పారు.
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందన్నారు. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు లభిస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటక అభివృద్ధిని వెనక్కు నెట్టాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తనకు మధ్య గ్యాప్ వచ్చిందనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటిని కుమారస్వామి ఖండించారు. జనవరి 18న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వచ్చారు. కుమారస్వామి హాజరుకాకపోవడంతో… కేసీఆర్‌తో చెడిందని ప్రచారం జరిగింది.