»Great Response To Ntr Commemorative Coins Record Sales
NTR స్మారక నాణేలకు విశేష స్పందన.. రికార్డు స్థాయిలో అమ్మకాలు
హైదరాబాద్ మింట్లో తయారైన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మార నాణేలకు విశేష స్పందన లభిస్తుంది. రెండున్నర నెలల్లో 25వేల నాణేలు అమ్ముడుపోవడం దేశంలోనే సరికొత్త రికార్డని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు
దివంగత ముఖ్యమంత్రి తెలుగు నట దిగ్గజం నందమూరి తారకరామారావు (NTR) శతజయంతి ఉత్సవాల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకరూ.100 నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 28న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఈ నాణేన్ని నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు.
హైదరాబాద్ (Hyderabad) మింట్ కాంపౌండ్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారు కాగా, మార్కెట్లోకి విడుదలైన 2 నెలల్లోనే 25 వేల నాణేలు అమ్ముడయ్యాయి. దేశంలోనే ఇది సరికొత్త రికార్డని మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ (TD Janardhan) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీఎన్ఆర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మహాత్మా గాంధీ వంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలో 12వేల నాణేలు రికార్డని.. ఆ రికార్డును ఎన్టీఆర్ స్మారక నాణెం
(Commemorative coin) బ్రేక్ చేసిందన్నారు.
ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణేన్ని ఢిల్లీ (Delhi) లో విడుదల చేశారని, 29వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కమిటీ చైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ అన్ని ఎన్టీఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందన్నారు. అన్నగారి శతాబ్ది సంవత్సరంలో కమిటీ, ఎన్టీఆర్ శాసనసభ ప్రసంగాలు, చారిత్రాక ప్రసంగాలు, శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చేయగా.. అందులో ఎన్టీఆర్ స్మారక నాణెం మొదటి వరుసలో ఉండడం గర్వకారణమన్నారు.