గత రాత్రి (ఆగస్టు 19) హైదరాబాద్ నగరంలో సంభవించిన భారీ వర్షంతో నగరంలో కొన్ని ఏరియాలు అస్తవ్యస్తంగా మారాయి. రాంపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి వరద నీటి ఉధృతిలో బైక్ నడపగా వర్షపు నీరు దాటికి బైకుతో సహా కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న కాలనీ వాసులు సత్వర స్పందనతో అతన్ని రక్షించారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో అతన్ని సురక్షిత స్థలానికి తరలించడానికి చొరవ తీసుకున్నారు.
భారత వాతావరణ శాఖ (IMD) నగరంలో ఈరోజు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు తమ ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరించింది. వీటిని దృష్టిలో ఉంచుకుని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
నగర యంత్రాంగం కూడా స్పందిస్తూ, వరద బాధితులకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది.
నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హైద్రాబాద్లో ముఖ్యమైన అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలీచౌకి, షేక్ పేట్ లో పలు లోతట్టు ప్రాంతాలలో మోకాలు లోతు నీళ్లు చేరి జలమయం అయ్యాయి. ఐటీ కంపెనీలు ఉండే మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ జామ్ లతో ఉద్యోగస్తులు నానా అవస్థలు పడ్డారు. గచ్చిబౌలి నుండి మియాపూర్, మాదాపూర్ నుంచి కూకట్పల్లి వెళ్లే రోడ్లలో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. ఉద్యోగులు ఇళ్లకు చేరుకోడానికి గంటల సమయం పట్టింది