వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఆయన పార్టీలో ప్రక్షాళన చేపడుతున్నారు. తాజాగా… ఆయన నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో షాకింగ్ కామెంట్స్ చేశారు.
పనితీరులో కనీస స్థాయి కంటే వెనుకబడి ఉన్న 27 మంది గురించి సీఎం ప్రస్తావించారు. అందులో ప్రస్తుత మంత్రులతో పాటుగా, మాజీ మంత్రులు – ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే అంశంలో వారసులకు పార్టీ టికెట్లు – అవకాశం కల్పించటం పైన ప్రస్తావనకు వచ్చింది. మచిలీపట్నంలో తన స్థానంలో తన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని కోరారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేనని చెప్పారు. ఇప్పటికే ఆర్దిక మంత్రి బుగ్గన వారసుడి వ్యవహారం పైనా పార్టీలో చర్చ జరుగుతోంది. దీని పైన ఈ సమావేశంలో సీఎం జగన్ తన వైఖరి స్పష్టం చేసారు.
వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేవని నిర్మొహమాటంగా చెప్పేసారు. వచ్చే ఎన్నికల్లో బుగ్గన, పేర్ని నాని వారసులకు టికెట్లు లేవని సూటిగా స్పష్టం చేసారు. మీరిద్దరూ తిరిగి తనతో కలిసి పని చేయాలని చెబుతూ.. ప్రజల్లోకి వెళ్లండని ముఖ్యమంత్రి ఆ ఇద్దరికీ దిశా నిర్దేశం చేసారు. అదే సమయంలో ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.
2019 ఎన్నికల సమయంలో ఇడుపుల పాయ కేంద్రంగా జగన్ ఒకే విడతలో లోక్ సభ – అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఈ సారి కూడా అదే విధంగా ఆరు నెలల ముందే అభ్యర్ధులను ఖరారు చేస్తానని ప్రకటించారు. పనితీరులో వెనుక బడి ఉన్న వారు తమ తీరు మార్చుకోకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వారసులకు టికెట్లు లేవని సీఎం చెప్పటంతో… నేతలు, అభిమానులు కూడా ఆలోచనలో పడ్డారు.