Anantapur:పెళ్లిలో ఆడపిల్లకు ఇవ్వాల్సిన సొత్తును మండపం నుంచే ఎత్తుకెళ్లిన దొంగ
Anantapur: అనంతపురంలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఆడపిల్ల పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును ఓ దొంగ మండపం నుంచే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అనంతపురం నగర శివారులోని నీలం రాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో గురువారం చోటుచేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Anantapur: అనంతపురంలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఆడపిల్ల పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును ఓ దొంగ మండపం నుంచే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అనంతపురం నగర శివారులోని నీలం రాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో గురువారం చోటుచేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాప్తాడుకు చెందిన బిల్లేనారాయణస్వామి కుమార్తెను వేపకుంటకు చెందిన సోమన్న కుమారుడితో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.
ఇందులో భాగంగా మే 31న అనంతపురం శివారులోని నీలంరాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో తలంబ్రాలు నిర్వహించారు. గురువారం జరిగిన వివాహ వేడుకకు హాజరైన అతిథులు తెచ్చిన బహుమతులను వధువు పేరెంట్స్ సర్దుతున్నారు. ఈ సమయంలో బిల్లే నారాయణస్వామి తన చేతిలో ఉన్న రూ.7.50 లక్షలు, రెండు తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును వారికి కేటాయించిన సేఫ్టీ రూంలో దాచాడు. అదే గదిలో పెళ్లికూతురు కానుకలను ఓ వైపుకు తరలించారు. అనంతరం డబ్బు సంచి వైపు చూడగా కనిపించలేదు.
అనుమానం వచ్చి కళ్యాణ మండపం అంతా గాలించారు. గదిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బయటకు రావడాన్ని చూసినట్లు సన్నిహితులు చెప్పారు. దీంతో బాధితులు నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించడం ప్రారంభించారు. మండపం నుంచి ఓ వ్యక్తి బయటకు వెళ్లడం కనిపించింది. అతనే దొంగా? లేదా అన్నది తెలియాలి. పెళ్లికి ఖర్చు చేయాలనుకున్న డబ్బులు మాయమైపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. కల్యాణ మండపంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తి ఫొటోను సేకరించారు. ఈ ఫోటో ఆధారంగా దొంగ కోసం వెతుకుతున్నారు.